మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ఖిలాడి. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ క్రమంలో ఖిలాడి దర్శకనిర్మాతలపై బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ కేసు పెట్టాడు. ఖిలాడీ టైటిల్ తనదని, 1992లో అక్షయ్ కుమార్ హీరోగా ఈ టైటిల్‌తో సినిమా కూడా రిలీజ్ చేసినట్లు పేర్కొన్నాడు.
ఈ విషయం గురించి అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఖిలాడీ పేరుతో దక్షిణాదిలో సినిమా తెరకెక్కుంతుదన్న విషయం తనకు ఇంతవరకు తెలియదని పేర్కొన్నాడు. ఈ మధ్యే ట్రైలర్ చూశాక తెలిసొచ్చిందన్నాడు. ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద ఇదివరకే ఖిలాడీ టైటిల్‌ను తను రిజిస్టర్ చేయించానని, కాబట్టి రవితేజ కథానాయకుడిగా నటించిన ఖిలాడి టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నాడు. తాను డబ్బులు ఆశించడం లేదని, ఖిలాడి సినిమా ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నానని స్పష్టం చేశాడు.
దక్షిణాదిన లోకల్ అసోసియేషన్స్‌లో టైటిల్ రిజిస్టర్ చేయించి వారి సినిమాలను అదే టైటిల్‌తో హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. హిందీ సినిమా టైటిల్స్‌కు దగ్గరగా ఉండే డబ్బింగ్ సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు సీబీఎఫ్‌సీ పర్మిషన్ ఇవ్వడం వల్లే ఇలా జరుగుతుందని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చాడు. ఖిలాడీ సినిమా హిందీలో రిలీజ్ అవుతున్న విషయం కూడా తనకు తెలియదన్నాడు. ఈ సినిమా టైటిల్‌ను మార్చేవరకు రిలీజ్‌ను ఆపాలని కోర్టును సంప్రదించాడు కానీ అప్పటికే సమయం మించిపోయిందని మెజిస్ట్రేట్ వ్యాఖ్యానించింది. దీంతో కనీసం ఓటీటీ రిలీజ్‌ను అయినా ఆపాలని కోర్టుకు విన్నవించాడు. ఈ వివాదంపై ఖిలాడీ చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment