KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ | Kiran Abbavaram KA Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

KA Movie Review: కిరణ్‌ అబ్బవరం ‘క’ మూవీ ఎలా ఉందంటే..?

Published Thu, Oct 31 2024 12:42 AM | Last Updated on Thu, Oct 31 2024 9:10 AM

Kiran Abbavaram KA Movie Review And Rating In Telugu

టైటిల్‌: క
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు
నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి 
దర్శకత్వం: సుజీత్‌, సందీప్‌
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్‌: శ్రీ వరప్రసాద్
విడుదల తేది: అక్టోబర్‌ 31, 2024


చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. అయితే ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్‌ తీసుకొని ఏకంగా పాన్‌ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘క’. టైటిల్‌ ప్రకటన నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆ ఆసక్తినికి మరింత పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

‘క’ కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్‌ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్‌ మ్యాన్‌ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్‌ కోసం రామ్‌(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్‌ మాస్టర్‌ రామారావు(అచ్చుత్‌ కుమార్‌) అనుమతితో పోస్ట్‌ మ్యాన్‌ అసిస్టెంట్‌గా జాయిన్‌ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు. 

అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్‌ అవుతుంటారు. వారిని కిడ్నాప్‌ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్‌ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్‌ షేక్‌ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్‌) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..?
ఇదొక డిఫరెంట్‌ సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. దర్శకద్వయం సందీప్‌, సుజిత్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. వినడానికి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ పేపర్‌పై రాసుకున్న కథను అర్థవంతంగా ప్రేక్షకులకు చూపించడంతో పూర్తిగా సఫలం కాలేదు.

కథగా చూస్తే ఇది పాతదే. కానీ దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉంటుంది. సినిమా చివరి 20 నిమిషాల వరకు ప్రేక్షకుడికి ఒక రకమైన అభిప్రాయం ఉంటే..క్లైమాక్స్‌ తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. కిరణ్‌తో పాటు చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో చెప్పినట్లు నిజంగానే ఈ మూవీ క్లైమాక్స్‌ కొత్తగా ఉంటుంది. ఇలా కూడా ఓ కథను చెప్పొచ్చా? అని ప్రేక్షకుడు ఆలోచిస్తూ థియేటర్స్‌ నుంచి బయటకు వస్తారు.

ముసుగు వేసుకున్న వ్యక్తి హీరోని ఓ గదిలో బంధించడం..పక్క గదిలో మరో హీరోయిన్‌ ఉండడం..ఇద్దరు ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అసలు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? ఎందుకు హీరోని బంధించాడు? తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటి సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి కలిగించారు. ముసుగు వ్యక్తిని కొంతమంది గుర్తించినా..చివర్లో ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ పాయింట్‌ రివీల్‌ అయ్యేవరకు దర్శకులు కథను నడిపించిన తీరు బాగుంది. 

అయితే ఉమెన్‌ ట్రాఫికింగ్‌ ఒక్కటే ఈ సినిమాలో ప్రధానాంశం కాదు. ముఖమైన మరో పాయింట్‌ కూడా ఉంటుంది. ఆ పాయింట్‌ కూడా పాతదే అయినా దాని చుట్టు అల్లుకున్న కథనం కొత్తగా ఉటుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్‌ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లో వరుసగా ట్విస్టులు రివీల్‌ అవుతూ ఉంటాయి. అయితే ఓ ఫ్లోలో వెళ్తున్న కథకి హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తుంది. సంభాషణలు కూడా బలంగా ఉండకపోవడం మరో మైనస్‌. అయితే చివరి 20 నిమిషాలో వచ్చే సన్నివేశాలు మాత్రం సినిమా పై అప్పటి వరకు ఉన్న ఒపీనియన్‌ను మారుస్తాయి. క్లైమాక్స్‌ చాలా కొత్తగా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే..
గత సినిమాలతో పోల్చుకుంటే నటన పరంగా కిరణ్‌ అబ్బవరం చాలా మెరుగుపడ్డాడు. పోస్ట్‌ మ్యాన్‌ వాసుదేవ్ పాత్రలో జీవించేశాడు. యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేశాడు. డైలాగ్‌ డెలివరీ కూడా పర్వాలేదు. హీరోయిన్‌ నయని సారిక తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే అని చెప్పాలి. ఇక మరో హీరోయిన్‌ తన్వి రామ్‌కి మంచి పాత్రే లభించింది. స్కూల్‌ టీచర్‌ రాధగా ఆమె చక్కగా నటించింది. బలగం జయరామ్‌, అచ్యుత్‌, రెడిన్‌ కింగ్‌ స్లే, శరణ్య, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 70ల కాలంనాటి పరిస్థితులను తెరపై చక్కగా చూపించారు. రాత్రివేళ వచ్చే సీన్స్‌ అద్భుతంగా తీశారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
అంజి శెట్టె,  సాక్షి వెబ్‌డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement