సినిమా అంటే వినోదం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కలర్‌ఫుల్ స్క్రీన్స్ వరకు, మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల దాకా ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇసుమంత లోటు కూడా కనిపించదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంటుంది చిత్రపరిశ్రమ. అటు ప్రేక్షకులు కూడా సినిమాలను ఆస్వాదిస్తారు, అందులో నటించే హీరోహీరోయిన్లను ఆరాధిస్తారు.
ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో పాతిక, యాభై, వంద, రెండు వందల రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు.. ఎంత పెద్ద సినిమా అయినా మూడు వారాలకు తట్టాబుట్టా సర్దాల్సిందే! ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏ చిత్రాన్ని ఎక్కువమంది చూశారో తెలుసా? బాహుబలి, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, దంగల్ సినిమాలనుకుంటే పొరపాటే! అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే. అంజాద్ ఖాన్‌కు ఇది తొలి చిత్రం. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్.. ఇలా అగ్రతారలు నటించారు. అప్పట్లో ఈ సినిమాకు టికెట్ల ఊచకోత జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి.
దర్శకుడు రమేశ్ సిప్పీ తెరకెక్కించిన ఈ ఐకానిక్ చిత్రం 1975లో రిలీజైంది. తొలి షోకే హిట్ టాక్.. ఫలితంగా ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రికార్డును దశాబ్ద కాలంపాటు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. షోలే తొలిసారి రిలీజైనప్పుడు, అలాగే రీరిలీజ్ అయినప్పుడు మొత్తంగా భారత్‌లో 15-18 కోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఇతర దేశాల్లో కూడా షోలేకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇది ఏ రేంజ్‌లో ఉందంటే ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు కొనేశారు అక్కడి జనాలు. ఇతర దేశాల్లో తక్కువలో తక్కువ 2 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోయాయట! అంటే ప్రపంచవ్యాప్తంగా 22 -26 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోవడంతో భారతీయ సినీచరిత్రలో షోలే రికార్డు సృష్టించింది. అప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల దాకా రాబట్టింది. ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే దాని విలువ సుమారు రూ.2800 కోట్ల దాకా ఉంటుంది.
టాప్ 10 చిత్రాలు
కేవలం భారత్‌లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల జాబితా విషయానికి వస్తే.. షోలే 15 కోట్లతో తొలి స్థానంలో ఉంది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ 12 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొఘల్ ఇ ఆజమ్, మదర్ ఇండియా.. చెరో 10 కోట్లు, హమ్ ఆప్కే హై కోన్..7.4 కోట్లు, ముఖద్దార్ కా సికిందర్.. 6.7 కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని.. 6.2 కోట్లు, క్రాంతి.. 6 కోట్లు, బాబీ.. 5.3 కోట్లు, గంగా జమున.. 5.2 కోట్లు, గదర్, కేజీఎఫ్ చాప్టర్ 2, సంఘం.. చెరో 5 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment