చిత్ర బృందంతో దర్శకుడు రామ్ అల్లాడి
సాక్షి, కోదాడ: ‘న్యూయార్క్’ చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి గాంధీజీ జీవిత ఇతివృత్తం మీద ‘మెటనోయా’ అనే చిత్రం తీర్చిదిద్ది విడుదలకు సిద్ధం చేశారు. గాంధీ జీవితంలో యదార్థ సంఘటనల ఆధారంగా.. కొన్ని కాల్పనిక అంశాలతో ఈ చిత్రం తీశారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అమెరికాలో, హాలీవుడ్ పరిజ్ఞానంతో నిర్మించారు. గాంధీజీ బాల్యం నుంచి, 1948లో న్యూఢిల్లీలో ఆయన హఠాన్మరణం వరకు ముఖ్య ఘట్టాలను, చరిత్రకు చెందిన కాలపట్టికకు అనుగుణంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు.
ఇతి వృత్తం..
మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ న్యాయవాది, వలసరాజ్య వ్యతిరేకి, జాతీయ వాది, రాజకీయ వేత్తగా తమ అహింసా శక్తితో, పౌర హక్కుల ఉద్యమంతో, భారత్‌ను బ్రిటీష్ బానిసత్యం నుంచి విముక్తి చేయడమే కాకుండా ప్రపంచానికి శాంతియుత మార్గదర్శకుడైన వైనాన్ని చిత్రీకరించారు. కాల్పనిక అంశాల సమ్మేళనంతో క్యాంట్ మెకానిజం, ఇన్సి్టయిన్ రోసన్బెర్గ్ బ్రిడ్జి, అంతరిక్షాంశాల వంటి శాస్త్రీయ విషయాలను మేళవిస్తూ గాంధీజీ జీవితాంశాలు వివరిస్తూ వారి సిద్ధాంతాలతో కూడిన సుసంపన్న జీవిత గాథను హృద్యంగా ఆవిష్కరించే విధంగా ఈ డాక్యుమెంటరీకి రూపకల్పన చేశారు.
అద్భుతమైన అంతర్జాతీయ చిత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తమ లక్ష్యం సాధించగలిగానని రామ్ అల్లాడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీజీ బాల్యం, గాంధీజీపై ఉన్న మక్కువ మెటనోయాలో ఆవిష్కృతమైంది. గాంధీజీ తత్వం, కేంద్ర బిందువుగా ఎక్కువ భాగం గాంధీజీ సొంత మాటల్లోనే చిత్ర సంభాషణలు ఉంటాయని, గాంధీ ఆత్మక«థ సత్యశోధనలోని మేజిక్ స్పెల్ ఆఫ్ బుక్ అనే అధ్యాయం ఆధారంగా కొన్ని కల్పానిక అంశాలతో రూపొందించినట్లు దర్శకుడు అల్లాడి పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో ఇప్పటికే రిలీజ్ అయింది. అదేవిధంగా ఫేస్‌బుక్ ద్వారా చూసే అవకాశం కల్పించారు.
చిత్రంలో కోదాడ వాసులు...
ఈ చిత్రంలో గాంధీజీ చిన్ననాటి మిత్రుడిగా కోదాడకు చెందిన అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన కొండపల్లి రాధాకృష్ణ కుమారుడు కొండపల్లి అనీష్ నటించాడు. అదేవిధంగా గాంధీజీ, ఫాదర్ ఆఫ్ లేడీతో కలిసి రైలులో ప్రయాణించిన వ్యక్తిగా అతిథి పాత్రలో కోదాడ కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కొండపల్లి సీతారామచందర్‌రావు నటించారు. కాగా గాంధీ వివిధ వయస్సు పాత్రలను అమెరికాలో స్థిరపడిన మన తెలుగువారు శ్రీనివాసరావు సనా పతి, రాజేష్‌రాజ్‌గోపాల్, తేజ్ కొండేటి, దీపక్ భీమ్‌రాశెట్టి నటించారు. కాగా కస్తూర్బా గాంధీగా అమెరికాకు చెందిన లారెంజో పల్లాడినో, మమాడివ్ శిశి, సరితా నవాలీ, కామ్యరాయసం నటించారు. కాగా... అమెరికాలో స్థిరపడిన కోదాడ వాసి అయిన భరద్వాజ్ వి .కొమరగిరి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం..
గాంధీజీ జయంతి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన చిత్ర సంస్థ అమెరికాతో పాటు అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకులు రామ్ అల్లాడి తెలిపారు. ఈ చిత్రానికి రామ్ దర్శకత్వం వహించడమే కాకుండా పూర్ణిమా దిగ్వీతో పాటు మరికొందరు అమెరికన్స్ సహకారంతో నిర్మించారు. కాగా దర్శకుడు వరంగల్ వాసి.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన గతంలో వరంగల్‌లోని పలు దేవాలయాలు, ఓరుగల్లు కోట తదితర చారిత్రాత్మక ఇతి వృత్తాలపై డాక్యుమెంటరీలు తీసి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment