
ప్రఖ్యాత దివంగత హాస్యనటుడు, గాయకుడు చంద్రబాబు జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుంది. తమిళ సినిమా మరిచిపోలేని హాస్య నటుడు చంద్రబాబు. ఈయన నటుడుగా పీక్‌లో ఉన్నప్పుడు కథానాయకుల కంటే అధిక పారితోషకం తీసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నటుడి బయోపిక్‌ను తెరకేక్కించేందుకు గోపాల్ వన్ స్టూడియోస్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు రామన్ తేడియ సీతై, చారులత, అలోన్, నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన హే సినామికా వంటి పలు విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది.
కాగా తాజాగా రచయిత దర్శకుడు కె. రాజేశ్వర్ రాసిన జేపీ. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవలను సినిమాగా రూపొందించడానికి హక్కులను, నటుడు చంద్రబాబు సోదరుడు జవహర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నవలను చిత్రంగా మలచడానికి కథకుడు, మాటల రచయిత జయమోహన్ సిద్ధమయ్యారని ఆయనతోపాటు యువ గీత రచయిత మదన్ కార్గీ కూడా స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం చంద్రబాబుకు తాము సమర్పించే మర్చిపోలేని అంజలిగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అదేవిధంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందన్నారు.
అయితే ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధనుష్ ఇప్పటికే ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు బయోపిక్‌లో తాను నటిస్తున్నట్లు ఎటువంటి ప్రకటన రాలేదు. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment