చిన్న ఆర్టిస్టులను బతికించండి: కోటా శ్రీనివాసరావు | Kota Comments On Sr NTR At NTR Memorial Awards Function | Sakshi
Sakshi News home page

చిన్న ఆర్టిస్టులను బతికించండి: కోటా శ్రీనివాసరావు

Published Sun, Jun 4 2023 10:36 AM | Last Updated on Sun, Jun 4 2023 11:08 AM

Kota Comments On Sr NTR At NTR Memorial Awards Function - Sakshi

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్‌, ప్రభ, శివకృష్ణ, రోజా రమని, కవిత, తనికెళ్ల భరణి, బాబు మోహన్‌, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయి మాధవ్‌, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బా సురేశ్‌ కుమార్‌ తదితరులను ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో డా. గారపాటి లోకేశ్వరి,నందమూరి మోహనకృష్ణ,నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్,నందమూరి యశ్వంత్, రిటైర్డ్ ఐ జి మాగంటి కాంతారావు, అంబికా కృష్ణ,తుమ్మల ప్రసన్నకుమార్,అనంతపురం జగన్,‘మా’ ఈ సీ  మెంబర్స్‌  తదితరులు పాల్గొన్నారు.

సన్మానం అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఇవాళ్ల రేపు సినిమా అనేది లేదు.. అంతా సర్కస్‌. విషాదకర పాటకు కూడా డాన్స్‌లు వేస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌ బాబు కానీ రెమ్యునరేషన్‌ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు.  కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్‌ గా చెపుతున్నారు. ఇది మంచి పద్థతి కాదు. అప్పట్లో ఎన్టీఆర్‌ శ్రీదేవితో డాన్స్‌ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి’’ అని అన్నారు. 

అలాగే ‘మా’ అసోసియేషన్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘ఎంతమంది ఆర్టిస్ట్‌ రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దృష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని కోరారు. పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతో ‘పది కోట్లతో సినిమా తీస్తే.. డబ్బు ఇవ్వద్దు.. రాయితీలు ఇవ్వద్దు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్‌ జరిగినా లొకేషన్‌ ఉచితంగా ఇస్తుంది అని ప్రకటించమని ప్రభుత్వానికి ఓ లెటర్‌ రాయండి’అని అన్నారు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో ప్రకటనలో నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్‌ క్లీన్‌ చేసే బ్రష్‌ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్‌ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండి’అని కోటా  శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.ఈవెంట్ ఆర్గనైజర్ మరియు మా ఈ సీ మెంబర్ విష్ణుబొప్పన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement