డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో అనూహ్యంగా క్రిష్ శుక్రవారం సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి విచారణకు వస్తానని చెప్పి ఆయన ముందస్తు బెయిల్‌కు వెళ్లడంతో ఆయనపై అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ వాయిదా పడటం.. ఆయన విచారణకు రావడం వంటి పరిణామాలు జరిగాయి.
అత్యంత గోప్యంగా పోలీసుల ముందుకొచ్చిన క్రిష్‌ను పోలీసులు కొద్దిసేపు విచారించిన అనంతరం రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. డ్రగ్స్ అంశాలపై క్రిష్ రియాక్ట్ అయ్యారు.. తాను ముంబయిలో ఉన్నానని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని తెలిపారు. ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్‌నాథ్ రక్త నమూనాలు పాజిటివ్‌గా రావడంతో ఈ కేసు కీలక పరిణామంగా మారింది. హోటల్‌పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడిషియల్ రిమాండుకు అనుమతి లభించలేదు.
మరోవైపు ఈ కేసులో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు రాలేదు. వారు డ్రగ్స్ తీసుకోకుంటే భయం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆలస్యం చేసేకొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే వారు కాలయాపన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని పోలీసులు భావిస్తున్నారు. నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తుండటంతో అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచారణకు రాని వారందరీ ఇళ్లకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అంటించారు.
Comments
Please login to add a commentAdd a comment