టైటిల్: కృష్ణ వ్రింద విహారి
నటీనటులు: నాగశౌర్య, షిర్లే సేథియా , రాధిక, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు
నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా ముల్పూరి
దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
విడుదల తేది: సెప్టెంబర్ 23,2022
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. నిర్మాతగా మారి ‘ఛలో’చిత్రంతో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటించిన అశ్వథ్థామ మొదలు.. గతేడాదిలో విడుదలైన ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ వరకు వరుసగా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు , పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్‌గా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్ 23)విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కృష్ణ(నాగశౌర్య)..పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సాంప్రదాయ బ్రాహ్మిణ్ యువకుడు. అతని తల్లి అమృతవల్లి(రాధిక) మాటని ఊరంతా గౌరవిస్తుంది. ఆమె ఏం చెప్పినా..అది కచ్చితంగా జరిగి తీరుతుందని గ్రామస్తుల నమ్మకం. కొడుకుని ఉద్యోగం రిత్యా హైదరాబాద్‌లో ఉన్న అల్లుడు (బ్రహ్మాజీ) ఇంటికి పంపిస్తుంది. అక్కడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు కృష్ణ. అక్కడ వర్క్ చేసే నార్త్ అమ్మాయి వ్రిందా(షీర్లే సేథియా)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను మెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసి..చివరకు ప్రేమలో పడేస్తాడు. వ్రిందాకు ఓ ఆరోగ్య సమస్య ఉంటుంది. దానిని దాచిపెట్టి, కుటుంబ సభ్యులకు ఓ అబద్దాన్ని చెప్పి వ్రిందాను పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. అసలు వ్రిందాకు ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? కుటుంబ సభ్యులతో కృష్ణ చెప్పిన అబద్దం ఏంటి? దాని వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? విభిన్నమైన అలవాట్లు ఉన్న కృష్ణ, వ్రిందాల వైవాహిక జీవితం ఎలా సాగింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
'కృష్ణ వ్రింద విహారి' క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ. ఈ చిత్రం కథ..ఇటీవల నాని నటించిన ‘అంటే సుందరానికీ’సినిమాను గుర్తు చేస్తుంది. ఆ సినిమాలో మాదిరే ఇందులో హీరో ఓ బ్రహ్మిణ్ కుర్రాడు. హీరో, హీరోయిన్ల ఫ్యామిలీ నేపథ్యం కూడా అలానే ఉంటుంది. అయితే కథనం మాత్రం వేరుగా ఉంటుంది. తెలిసిన కథే అయినప్పటికీ.. ప్రతి సీన్ చాలా ఫ్రెష్‌గా, కామెడీగా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చింది.
సినిమా ప్రారంభంలోనే కృష్ణ ఫ్యామిలీ నేపథ్యం, వారు పాటించే సంప్రదాయలను చూపించిన దర్శకుడు... కాసేపటికే కథను హైదరాబాద్‌కు తరలించాడు. అక్కడ హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఆమెను మెప్పించడానికి హీరో నానా కష్టాలు పడడం..ఇలా సాదా సీదాగా ఫస్టాఫ్ సాగుతుంది. ఫస్టాఫ్‌లో కొంతమేర కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. కానీ సెకండాఫ్‌లో మాత్రం వినోదాన్ని బాగా పండించాడు.
కృష్ణ, వ్రిందాల పెళ్లి తర్వాత వచ్చే సన్నీవేశాలు, అత్త, కోడళ్ల మధ్య జరిగే పంచాయితీ నవ్వులు పూయిస్తుంది. తల్లి, పెళ్ళాం మధ్య హీరో నలిగే సన్నివేశాలకు కొత్తగా పెళ్లైన భర్తలు కనెక్ట్ అవుతారు. అలాగే కోమాలోకి వెళ్లిన వెన్నెల కిషోర్‌తో సత్య, రాహుల్ రామకృష్ణ, నాగశౌర్య కలిసే చేసే కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీతో ప్రేక్షకులను కొంతమేర ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడనే చెప్పాలి.
ఎవరెలా చేశారంటే..
కృష్ణ పాత్రలో నాగ శౌర్య మెప్పించాడు. ఈ చిత్రంలో నాగశౌర్య ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిణ్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా,అత్తా కోడళ్ల మధ్య నలిగే భర్తగా.. ఇలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. వ్రిందా పాత్రకి షిర్లే సేథియా న్యాయం చేసింది. ఆమెకిది తొలి తెలుగు సినిమా. తెరపై అందంగా కనిపించింది. బ్రహ్మాజీ, సత్య, వెన్నెల కిశోర్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరో నాన్నగా జయప్రకాశ్, నాన్నమ్మగా అన్నపూర్ణమ్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మహతి స్వరసాగర్ పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది. నాగ శౌర్య, షెర్లీని చక్కగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment