‘క్షీర సాగర మథనం’ మూవీ రివ్యూ | Ksheera Sagara Madhanam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘క్షీర సాగర మథనం’ మూవీ రివ్యూ

Published Fri, Aug 6 2021 7:11 PM | Last Updated on Wed, Aug 11 2021 5:23 PM

Ksheera Sagara Madhanam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : క్షీర సాగర మథనం
నటీనటులు :  మానస్,  చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు
నిర్మాణ సంస్థ : ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్
దర్శకత్వం: అనిల్ పంగులూ
సంగీతం :  అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ : సంతోష శానమోని
ఎడిటర్‌ : వంశీ అట్లూరి


శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై డెబ్యూ డైరెక్టర్ అనిల్ పంగులూరి తెరకెక్కించిన చిత్రం ‘క్షీర సాగర మథనం. వాస్తవానికి  ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ.. శుక్రవారం(ఆగస్ట్‌ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్. ప్రదీప్ రుద్ర విలన్ గా నటించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘క్షీర సాగర మథనం’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ: 
రిషి(మానస్ నాగులపల్లి), ఓంకార్(సంజయ్ కుమార్) మరో ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. వీరిని ఓ టెర్రరిస్ట్‌ (ప్రదీప్‌ రుద్ర) పార్టీకి పిలిచి, వారి శరీరంలో ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఓ డివైజ్ ను అమర్చి... ఆ ఐదు మందిని మానవ బాంబులుగా మార్చి... భారీ పేలుడుకు పక్కా ప్లాన్ వేస్తాడు. వ్యక్తిగత జీవితంలో ఆటుపోటులు ఎదుర్కొని, చివరకు లైఫ్ సెటిల్ అవుతుందని భావిస్తున్నతరుణంలో జరిగిన ఈ ఊహించని ఘటన వారి జీవితాలను ఏ తీరాలకు చేర్చిందన్నదే మిగతా కథ.

నటీనటులు
బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత కొన్ని చిత్రాలలో, సీరియల్స్ లో హీరోగా నటించిన మానస్.. రిషి పాత్రలో ఒదిగిపోయాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ కొడుకుగా, ప్రియురాలు వెతుకుతోంది తననే అని తెలిసినా, ఆ మాట చెప్పలేని నిస్సహాయుడిగా చక్కగా నటించాడు. అలానే యాక్షన్ సన్నివేశాలలోనూ మెప్పించాడు. ఇక బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్‌ ఓంకార్‌ పాత్రకు న్యాయం చేశాడు. తన పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో మొదలైనా చివరకు పాజిటివ్‌గా మారుతుంది. హీరోయిన్‌గా నటించిన అక్షత సోనావాలే నటన ఫర్వాలేదు. విలన్‌ పాత్రకు ప్రదీప్‌ రుద్ర న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

విశ్లేషణ
టైటిల్‌కి తగ్గట్టే... ఏడు పాత్రల తాలూకు భావోద్వేగ సంఘర్షణల మథనమే ‘క్షీర సాగర మథనం’ కథ. అనిల్ పంగులూకు ఇది తొలి సినిమా అయినా.. అనుభవం ఉన్న దర్శకుడిగా మూవీని తెరకెక్కించాడు. ఎన్ని కష్టాలొచ్చినా... వాటిని ధైర్యంగా ఫేస్ చేసి ముందుకు సాగాలనే కాన్సెప్ట్‌తో కథ.. కథనాలను నడిపించిన తీరు బాగుంది. తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా డీవియేట్ కాకుండా తెరమీద చూపించడంలో దర్శకుడు కొంత మేరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఐదుగురి స్నేహితుల సమస్యలను టెర్రరిజానికి ముడిపెడుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు లోనయ్యేలా చేశారు దర్శకుడు.

మొదట్లో కథలోకి వెళ్లడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నా... ఆ తరువాత సినిమా వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్‌ వచ్చేసరికి కథ కాస్త నెమ్మదిగా సాగుతూ.. ప్రేక్షకులకు బోరింగ్‌ అనిపించక మానదు. క్లెమాక్స్‌ కూడా కాస్త పేలవంగా అనిపిస్తుంది. ఐదుగురు స్నేహితుల సమస్యల్లో కాస్తంత ఆసక్తికరంగా ఉంది గోవింద్‌, విరిత జంటలదే. మిగిలిన వారి సమస్యలు, వాటి పరిష్కారాలు పెద్దగా ఆసక్తిని కలిగించేలా లేవు. అయితే ఓవరాల్‌గా హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా కథను నడిపించిన తీరు ప్రశంసనీయం. అజయ్ అరసాడ సంగీతం వినసొంపుగా ఉంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేస్తే మరింత బాగుండేది. సంతోష శానమోని సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement