
ఫైల్‌ఫోటో
గాన గంధర్వురాలు, భారత రత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్(92) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమె మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.
కాగా ప్రజలు ఆమెకు నివాళులు అర్పించేందుకు వీలుగా నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలవరకు ఆమె పార్థివ దేహాన్ని తన నివాసంలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.
1942లో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. నౌషాద్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు.. ఎందరి సంగీతంలోనో ఆమె పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆమె.. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. కానీ మన దురదృష్టం.. తెలుగులో మూడు పాటలు పాత్రమే ఆలపించారు.