సినిమా అంటేనే ఇలానే ఉండాలి అనేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ మూవీస్ వస్తుంటాయి. ఇవి కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'లెవల్ క్రాస్'. ఒరిజినల్‌గా దీన్ని మలయాళంలో తీశారు. కానీ రీసెంట్‌గా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?
కథేంటి?
రఘు (అసిఫ్ అలీ) ఎడారి ప్రాంతంలో ఒక చోట రైల్వే గేట్ కీపర్. నిర్మానుస్య ప్రాంతంలో ఒక్కడే చెక్క ఇంట్లో నివసిస్తుంటాడు. ఓ రోజు వేగంగా వెళ్తున్న ట్రైన్‌లో నుంచి ఒక అమ్మాయి కింద పడినట్లు రఘు గమనిస్తాడు. దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయిన ఆమెని తన ఇంటికి తీసుకొస్తాడు. కోలుకున్న తర్వాత ఆమెకు తన గురించి చెబుతాడు. ఆమె కూడా తన గురించి చెబుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఓ సినిమా తీయాలంటే హీరోహీరోయిన్ ఉండాలి. ఆరు పాటలు, మూడు ఫైట్స్, అవసరం లేకపోయినా సరే కామెడీ.. ఇలా పాన్ ఇండియా పేరుతో వందలకోట్ల బడ్జెట్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అవేవి అక్కర్లేదని 'లెవల్ క్రాస్' సినిమా నిరూపించింది. మూడే పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్ర సినిమా అంతా రెండు-మూడు డ్రస్సులో మాత్రమే కనిపిస్తారు. అలాంటి విచిత్రమైన మూవీ ఇది.
ప్రతి మనిషి జీవితంలో ఎవరికీ తెలియని యాంగిల్ ఒకటి ఉంటుంది. ఒకవేళ అది మరో వ్యక్తికి తెలిస్తే.. మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఎంతకు తెగిస్తారు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే ఇది. సినిమా కథ గురించి చెబితే మళ్లీ స్పాయిలర్ అవుద్దేమో! కాస్త ఓపికతో చూస్తే మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయితే వస్తుంది.
సినిమాలో మూడు పాత్రలు ఒక్కోటి ఒక్కో స్టోరీ చెబుతాయి. కానీ ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది మనకు అర్ధం కాదు. ఒకటి జరుగుతుందని అనుకుంటాం. కానీ తర్వాతి సీన్‌లో ఊహించనది జరుగుతుంది. ఒక్కొక్కరి గతం గురించి బయటపడే ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరు? హీరో అనేది ప్రారంభంలో చాలామంది గెస్ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో కచ్చితంగా అలా కనిపెట్టలేరు.
సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే డౌటే. ఎందుకంటే ఏదో ఆర్ట్ మూవీ తీసినట్లు చాలా నిదానంగా వెళ్తుంది. దాదాపు 45 నిమిషాల వరకు అలా సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ వస్తాయి. మధ్యలో ఓ పాట ఉంటుంది కానీ అది అనవసరం అనిపించింది.
యాక్టింగ్ పరంగా అసిఫ్ అలీ, అమలాపాల్, షరాఫుద్దీన్ ఆకట్టుకున్నారు. 'దృశ్యం' డైరెక్టర్ జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అర్భాజ్ ఆయూబ్ దర్శకుడు. ఎంచుకున్న పాయింట్ చాలా డిఫరెంట్. దాన్ని తీసిన విధానం అంతకంటే డిఫరెంట్. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్, యాక్షన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా థ్రిల్లర్ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.
-చందు డొంకాన
Comments
Please login to add a commentAdd a comment