టైటిల్: లిల్లీ
నటీనటులు: బేబీ నేహా, బేబి ప్రణతిరెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: గోపురం స్టూడియోస్
నిర్మాతలు: కె. బాబురెడ్డి, సతీష్ కుమార్.జి
సంగీతం: ఆంటో ఫ్రాన్సిస్
కథ-దర్శకత్వం: శివమ్
విడుదల తేదీ: జూలై 07
ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు ఈ ప‍్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ చిన్న పిల్లల చిత్రం రెడీ అయిపోయింది. 'లిల్లీ' పేరుతో తీసిన ఈ మూవీ.. జూలై 07న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
లిల్లీ (బేబీ నేహా), దివ్య (ప్రణతి రెడ్డి), గూగుల్ (వేదాంత్ వర్మ) క్లాస్‌మేట్స్. ఓ రోజు వాళ్లంతా ఆడుకుంటున్నప్పుడు సడన్‌గా ముక్కు నుంచి రక్తం రావడంతో దివ్య కళ్లు తిరిగి కిందపడిపోతుంది. పిల్లలందరూ దివ్యకు ఏమైందో అని కంగారు పడుతూ దివ్యను పెంచిన మామయ్య దేవాకు(రాజ్‌వీర్) చెప్తారు. పాపను హాస్పిటల్‌కి తీసుకెళ్లిన దేవాకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అసలు దివ్యకు ఏమైంది? లిల్లీ , వేదాంత్‌లు దివ్య కోసం ఏం చేశారు? చిన్న చిన్న పనులు చేసుకుని రోజులు గడుపుకునే దేవా.. పాపకి వచ్చిన కష్టాన్ని ఎలా తొలగించాడు? అనేది స్టోరీ.
ఎలా ఉందంటే?
ఐదు భాషల్లో పాన్ ఇండియా పిల్లల సినిమాగా 'లిల్లీ' తీశారు. గోపురం స్టూడియోస్ పతాకంపై బాబురెడ్డి, సతీష్ కుమార్‌లు నిర్మించిన ఈ చిత్రంతో శివమ్ నూతన దర్శకునిగా పరిచయమయ్యాడు. కడపలాంటి రూరల్ ఏరియాలో ఈ సినిమా కథ మొత్తాన్ని తీశారు. పూర్తిగా చిన్నపిల్లలు నటించిన ఇలాంటి చిత్రం తెలుగులో గత కొన్నేళ్లలో రాలేదనే చెప్పాలి. సినిమాను చూస్తున్నంతసేపు దర్శకుడు శివమ్ తన మొదటి చిత్రాన్నే ఇంతటి ఎమోషనల్ పాయింట్‌ను ఎందుకు ఎంచుకున్నాడో అనిపిస్తుంది. ఈ చిన్నపిల్లల కథలో అంత డెప్త్ ఉంది. అలాగే చిన్నపిల్లల స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుందో చూపించే ప్రయత్నంలో విజయం సాధించాడు.
ఎవరెలా చేశారు?
చిన్న పిల్లలే ప్రధాన పాత్రధారులుగా తీసిన ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటించారు. అయితే వాళ్ల నుంచి ఎమోషన్ బాగానే రాబట్టినప్పటికీ.. ఫస్టాప్ నెమ్మదిగా ఉండటం సినిమాకు మైనస్ అయింది. 'లిల్లీ' మూవీ ఫొటోగ్రఫీ బాగుంది. సింగర్ వాగ్దేవి పాటిన రెండు పాటలు బాగున్నాయి. చూసిన వాళ్లకు ఇవి నచ్చేస్తాయి. అయితే సినిమా మొత్తం పిల్లలతోనే తీశారు కాబట్టి ఇది పెద్దవాళ్లకు కనెక్ట్ కావడం కొంచెం కష్టం. ఏదేమైనా సరే అందరూ కొత్తవాళ్లు, అదికూడా పిల్లలతో తీసిన ఈ చిత్రబృందం ఆలోచన ప్రశంసనీయం.
Comments
Please login to add a commentAdd a comment