‘‘ఫిదా’ సినిమా కోసం శేఖర్ కమ్ములగారికి నేను పంపిన పాటలు నచ్చాయి. అయితే ‘ఫిదా’ నాకు చాలా ముఖ్యం.. ఈ సమయంలో కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారాయన. ‘లవ్‌స్టోరీ’ సినిమాకు మాత్రం పిలిచి అవకాశం ఇచ్చారు’’ అని సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’.
ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ– ‘‘మా తాతగారు, నాన్నగారు విజయ్ సినిమాటోగ్రాఫర్స్‌గా చేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. చదువు పూర్తయ్యాక సంగీతం నేర్చుకున్నాను. ఒక సంగీత విభావరిలో ఏఆర్ రెహమాన్‌గారికి నా కంపోజిషన్ నచ్చి, సహాయకుడిగా పెట్టుకున్నారు. ఆయనతో ‘శివాజీ, రోబో, సర్కార్’ వంటి చిత్రాలు చేశాను. ‘లవ్‌స్టోరీ’ విషయానికొస్తే... ‘పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి.. అంతకంటే ఇంకేం వద్దు’ అన్నారు శేఖర్‌గారు. కంపోజిషన్‌లో ఆయన ఇచ్చిన సలహాలు అద్భుతం. ఆయనకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. ‘సారంగ దరియా..’ను బాగా చేయాలని చెప్పి చేయించారు. ‘లవ్‌స్టోరీ’ పాటలు మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా తృప్తిగా ఉంది. ఈ చిత్రంలోని పాటలు రెహమాన్‌గారికి పంపాలంటే భయమేసింది. కానీ నా మిత్రులు కొందరు నా పాటలు బాగున్నాయని ఆయనతో చెప్పారట. మంచి చిత్రాలు చేసి, సంగీత దర్శకుడిగా నాకంటూ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment