టైటిల్: లక్కీ భాస్కర్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులు
నిర్మాత: నాగవంశీ
డైరెక్టర్: వెంకీ అట్లూరి
మ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్
విడుదల తేదీ: 2024 అక్టోబర్ 3
మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇతడి లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేశారు. ఓ రోజు ముందే ప్రిమియర్స్ వేశారు. ఇంతకు సినిమా ఎలా ఉంది? దుల్కర్ మరో హిట్టు కొట్టాడా? తెలియాలంటే రివ్యూ చూసేయండి.
కథేంటి?
ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.
ఎలా ఉంది?
1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వెబ్ సిరీస్ కూడా తీశారు. హర్షద్ మెహతా.. ప్రభుత్వాన్ని, స్టాక్ ఎక్సేంజ్ ని బురిడీ కొట్టించాడు. ఒకవేళ అతడ్ని ఓ బ్యాంక్ లో పనిచేసే కామన్ మాన్ బురిడీ కొడితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమానే లక్కీ భాస్కర్.
ఈ స్టాక్ ఎక్సేంజ్, బ్యాంక్ ల్లో చాలా స్కామ్ లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం కానీ ఓ పట్టాన అర్థం కావు. ఒకవేళ ఎవరైనా అర్థం అయ్యేలా చెబితే.. కాదు కాదు చూపిస్తే ఎలా ఉంటుంది. వినడానికే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది కదా. లక్కీ భాస్కర్ చూస్తున్న ప్రతి సెకండ్ అలానే అనిపిస్తుంది.
సీబీఐ వాళ్ళు భాస్కర్ ని అదుపులోకి తీసుకుని, బ్యాంక్ కి తీసుకుని వెళ్లి, విచారణ ప్రారంభించడంతో సినిమా మొదలౌతుంది. కట్ చేస్తే కథ మూడేళ్ల వెనక్కి వెళ్తుంది. అసలు భాస్కర్ ఎవరు? అతడి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనేది స్వయంగా భాస్కర్.. ప్రేక్షకుల వైపు చూసి చెప్తుంటాడు. ఈ జర్నీలో డబ్బు.. భాస్కర్ ని ఎలా మార్చింది. కొందరి వల్ల చివరకు భాస్కర్.. ఈ స్కామ్ లో నుంచి బయట పడ్డాడా లేదా అనేది మీరు థియేటర్ లోనే చూడాలి.
ఇందులో పేరుకే భాస్కర్ హీరో క్యారెక్టర్ కానీ.. అతడి కూడా ఉండే ప్రతి పాత్ర కథలో భాగమే.. ఏదో ఓ సందర్భంలో ఓ పాత్ర వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ లు గురించి ఇక్కడ చెప్తే మీరు థ్రిల్ మిస్ అవుతారు.
అన్ని ప్లస్ లేనా మైనస్ పాయింట్స్ ఏం లేవా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ సినిమా కథలో బ్యాంక్, స్టాక్ మార్కెట్ లో షేర్స్, హవాలా లాంటివి వినిపిస్తుంటాయి. కాబట్టి వాటి మీద మినిమం అవగాహన ఉంటే పర్లేదు. లేదంటే మాత్రం సినిమా అర్థం కాదు. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో లౌడ్ గా అనిపించింది.
ఈ సినిమా 1992 టైం లైన్ లోనే జరుగుతుంది. దీంతో హర్షద్ మెహతా ని పోలిన పాత్ర ఒకటి పెట్టారు. హర్ష మెహ్రా అనే పేరు పెట్టారు. కానీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఐతే ప్రైవేటు బ్యాంక్ ల్లో ఎలాంటి స్కాములు జరుగుతాయి అనేది మాత్రం ఓ సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పడం బాగుంది.
ఎవరెలా చేశారు?
భాస్కర్ పాత్రలో దుల్కర్ జీవించేసాడు. ప్రతి సందర్భంలోనూ భాస్కర్ గెలవాలని మనం అనుకుంటాం. భాస్కర్ భార్య సుమతిగా చేసిన మీనాక్షి చూడ్డానికి బాగుంది. కాకపోతే భాస్కర్ రోల్ వల్ల ఈమెకు సరైన స్పేస్ దక్కలేదేమో అనిపిస్తుంది. కొడుకు, తండ్రి పాత్రలు ఎందుకు ఉన్నాయిలే అనుకుంటాం. వీటితో పాటు ఆంటోనీ రోల్ కథని మలుపు తిప్పుతాయి. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్, భాస్కర్ ఫ్రెండ్, బార్ డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి చివరకు బిచ్చగాడి పాత్రని కూడా వేరే లెవెల్ లో వాడేసారంతే.
టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. రెగ్యులర్ గా మనం న్యూస్ పేపర్స్ లో చదివే స్కామ్స్ తో ఓ కల్పిత కథ రాసి, దాన్ని రేసీ థ్రిల్లర్ మూవీలా తీయడం సూపర్. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీమతి గారు పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్. సినిమాటోగ్రఫీ సూపర్. సెట్స్ గురించి బాగా డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రతి సీన్ లో అది కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే.. సినిమాలో హీరో లక్కీ. ఈ మూవీ చూసిన ప్రేక్షకుడు అంతకంటే లక్కీ..
Rating : 3.25/5
- చందు డొంకాన
Comments
Please login to add a commentAdd a comment