'కంగువ' టీమ్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన మద్రాసు హైకోర్టు | Madras High Court Line Clear For Kanguva Movie Release | Sakshi
Sakshi News home page

'కంగువ' టీమ్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన మద్రాసు హైకోర్టు

Published Sat, Nov 9 2024 1:08 PM | Last Updated on Sat, Nov 9 2024 1:23 PM

Madras High Court Line Clear For Kanguva Movie Release

సౌత్‌ ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా నిర్మాతలకు మద్రాస్‌ కోర్టు శుభవార్త చెప్పింది. కంగువ విడుదలను నిలిపివేయాలని రిలయన్స్‌ సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పూర్తిగా పరిశీలించిన కోర్టు ఫైనల్‌ తీర్పును వెల్లడించింది. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని క్లారిటి ఇచ్చింది. దీంతో ముందుగా అనుకున్న సమయానికే కంగువ విడుదల కానుందని ప్రకటించింది.

కంగువ నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో పలు చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే  జ్ఞానవేల్‌ రాజా రుణం  పొందారు. అయితే,  రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది. 

అయితే, తాజాగా జరిగిన విచారణలో స్టూడియో గ్రీన్ కంపెనీ తరపున ఉన్న న్యాయవాది మాట్లాడుతూ.. రిలయన్స్ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం డబ్బు పూర్తిగా చెల్లించామన్నారు.  దీంతో లాయర్‌ చెప్పిన మాటలను రికార్డ్‌ చేసుకున్న న్యాయస్థానం కంగువ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని తెలిపింది. జస్టిస్ అబ్దుల్ కుద్దూస్ ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. నవంబర్‌ 8న రియలన్స్‌కు  కేఈ.జ్ఞానవేల్‌ రాజా రూ. 55 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో దీన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2,500 స్క్రీన్స్‌లలో ఈ చిత్రం విడుదలైతే.. ఉత్తరాదిలో 3,500 స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టేలా కంగువ ఉంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement