
ట్రెండ్ మారినా ఫ్రెండు మారడే.. ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్‌షిప్పే.. అని పాట పాడుకుంటోంది మహాతల్లి జాహ్నవి. యూట్యూబర్‌లో ఫన్నీ వీడియోలతో నవ్వించిన మహాతల్లి ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. జాహ్నవి- సుశాంత్ రెడ్డి దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. అయితే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దిగిన ఫోటోలన్నింటినీ వరుస పెట్టి రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తన ముగ్గురు ఫ్రెండ్స్ (నిహారిక, వితికా, భార్గవి)తో స్పెషల్‌గా దిగిన ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనలైంది.
బాలి ట్రిప్‌తో బాండింగ్
'ఫీమేల్ ఫ్రెండ్‌షిప్ ప్రాముఖ్యత ఎదిగే వయసులో పెద్దగా తెలీలేదు. ఇప్పటికీ మేము నలుగురం ఇంతలా ఎలా క్లోజ్ అయ్యామో అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కో రకం. మా అందరిదీ వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్.. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా ఏదో కొంతకాలం కలిసుంటాంలే అనుకున్నాను. కానీ బాలి ట్రిప్‌తో మా బంధం బలపడింది. ఫ్రెండ్స్ అయ్యాక విహారయాత్రలకు వెళ్లడం మామూలే.
లైఫ్‌లో చిన్న బ్రేక్ తీసుకోవాలని..
కానీ మేమంతా లైఫ్‌లో ఒక బ్రేక్ తీసుకోవాలని చూస్తున్నాం. ఆ ఆలోచనతోనే ఈ ట్రిప్పుకు వెళ్లాం. నిజానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లేవరకు కూడా ఈ విహారయాత్ర నుంచి ఎలా తప్పించుకోవాలనే చూశాను. కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఇంత అందమైన స్నేహాన్ని, ప్రేమను మిస్ అయ్యేదాన్ని అనిపిస్తోంది. నాకంటూ ముగ్గురు, నలుగురు స్నేహితులుంటే చాలు ఇంకెవరూ వద్దు అన్నంతలా మారిపోయాను.

స్నేహానికి మారుపేరులా..
ఎందుకంటే ఎవరితోనైనా స్నేహం చేసినప్పుడు.. అది వర్కవుట్ కాకపోతే.. గొడవలు వస్తే.. ఎలా అన్న భయం నన్నెప్పుడూ వెంటాడుతుంది. కానీ ఈ అమ్మాయిలు స్నేహానికి కొత్త నిర్వచనంలా మారిపోయారు. ప్రతి విషయాల్లో బలవంతంగా దూరకుండా నాకంటూ టైమ్ ఇస్తూనే నా బాగోగులు చూసుకునేవారు. అందుకేనేమో వారికి అంతగా క్లోజ్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో మంచి రోజుల్ని, చెడ్డ రోజుల్ని రెండింటినీ చూశాను. ఈ ఫ్రెండ్స్ లేకపోయుంటే నా జర్నీ ఇలా ఉండేదే కాదు.
ఐ లవ్యూ..
మీరంతా కలిసి నన్నెక్కువ ముద్దు చేసేవారు. అది చూసి నేను కొంత భయపడేదాన్ని కానీ ఇప్పుడలా కాదు. మీరు నా చుట్టూ ఉంటే అదే నా సేఫ్ ప్లేస్. నన్ను బాగా చూసుకున్నందుకు, తినిపించినందుకు, ప్రేమించినందుకు థాంక్యూ. నా కూతురికి మీరందరూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్యూ అని జాహ్నవి రాసుకొచ్చింది. ఫ్రెండ్స్ నిహారిక కొణిదెల, వితికా షెరు, అంబటి భార్గవిని ట్యాగ్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండరు అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. తారక్ ఎమోషనల్