తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ భగ్గుమంటుంది. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్‌తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.
మహేశ్ బాబు
'మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా మీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఒక మహిళా మంత్రిగా మీరు మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, మీ భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్‌లో ఉన్న అందరినీ అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను, మన సినీ సోదరులను గౌరవంగా చూడాలి.' అని మహేశ్ కోరారు.
రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంబించడం నన్ను భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానానికి మించినది. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సమాజానికి ఉదాహరణగా నిలువాలి. అందరిలోనూ సామాజిక విలువలను పెంచాలి. వాటిని తగ్గించకూడదు.- రవితేజ
మంత్రి కొండా సురేఖ గారి నుంచి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీకు తెలిసే ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషంతో తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. మీ మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రాహుల్ గాంధీని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మీ పార్టీలోని నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి. భవిష్యత్ తరాలకు మనం సరైన ఉదాహరణగా ఉండాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. ఈ వ్యక్తిగత దూషణలు చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి తెస్తోంది. అని భావిస్తున్నాను. - మంచు మనోజ్
రాజకీయాల కోసం సినీ, టీవీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయడం సరికాదు. చిత్ర పరిశ్రమలోని మేమందరమూ కూడా కుటుంబ సమేతంగా కలిసి నిరసన తెలియజేస్తున్నాం. వ్యూస్ కోసం తప్పుడు థంబ్‌నెయిల్‌లతో అవే వీడియోలను పోస్ట్ చేయవద్దని యూట్యూబర్స్‌ణు అభ్యర్థిస్తున్నాను. ఇతర వృత్తిలాగే మమ్మల్ని కూడా గౌరవించండి. - సుమ కనకాల
సినీ ప్రముఖులపై రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇది వ్యక్తిగత జీవితాలను దోపిడీ చేయడం .దయచేసి మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ రకమైన నీచమైన వ్యాఖ్యలు, మాటల దూషణలకు వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నాము. - కిరణ్ అబ్బవరం
శ్రీమతి కొండా సురేఖ.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా అసహ్యంగా మాట్లాడటం మమ్మల్ని చాలా బాధపెట్టింది.
ఇలాంటి నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం అంత మంచి నిర్ణయం కాదు. మీ రాజకీయం కోసం సినీ పరిశ్రమ సభ్యుల వ్యక్తిగత జీవితాలను లాగితేప సహించం. - రాజశేఖర్
మీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివి. చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా ఇంత నీచంగా దిగజారి, మీడియా ముందు అవమానకరమైన వ్యాఖ్యలను ఎలా చేయగలరు..? సెలబ్రిటీల పేర్లను, వారి వ్యక్తిగత జీవితాన్ని లాగడం, వారిపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. హద్దులు దాటి ఒక వ్యక్తి గుర్తింపును అగౌరవపరచడం సహించలేని చర్య. ఇలాంటి వాటిని సమాజం తిరస్కరిస్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవించండి. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ.. సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నాం. మహిళా మంత్రినే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.' అని చెప్పుకొచ్చింది. - సంయుక్త మేనన్
నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై నా ఆలోచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడుతున్నా. ప్రజలకు మంచి జరగడానికి మేము ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాము. ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము, అంగీకరించలేము. రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదు. మీరుండేది ప్రజల బాగోగులూ చూసుకునేందకని గుర్తుపెట్టుకోండి. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల, విద్య గురించి మాట్లాడండి. ఉద్యోగాలు కల్పించి వారి శ్రేయస్సు కోసం కష్టపడండి. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలను దిగజార్చకండి.' అంటూ కొండా సురేఖపై కామెంట్ చేశారు. - విజయ్ దేవరకొండ
సమంత గారిపై, అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్క చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో చైల్డ్ అబ్యూస్ కేసులో ముందుగా స్పందించిన మీరే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధనిపిస్తుంది. మీ రాజకీయ విమర్శల కోసం ఏ మాత్రం సంబంధం లేని నటీనటుల పేర్లు తీసుకురావడం.. ఆపై వాళ్ల వ్యక్తిగత జీవితంపై దిగజారుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరే ఇలా మాట్లాడడం సమాజానికి శ్రేయస్కరం కాదు. మావి చాలా సున్నితమైన మనసులు. వాటిని గాయం చేసి మీ రాజకీయం కోసం వాడుకోవడం తగదు. గతంలో మా కుటుంబాన్ని కూడా ఎన్నిసార్లు లక్ష్యంగా చేసుకుని దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము స్పందించలేదు. మేమెప్పుడూ ఏమీ అనమని సాఫ్ట్ టార్గెట్ చేయవద్దు. దయచేసి ఇకపై నటులను మాత్రమే కాదు.. ఎవరి వ్యక్తిగత విషయాలపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదని కోరుకుంటున్నాను. - సాయి ధరమ్‌తేజ్
Comments
Please login to add a commentAdd a comment