సంక్రాంతికి రిలీజైన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన సైంధవ్ ఆల్‌రెడీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే! తాజాగా మహేశ్‌బాబు మాస్ మసాలా మూవీ గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది.
వారం రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లో..
ఇది చూసిన ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. రౌడీ రమణ వచ్చేస్తున్నాడ్రోయ్.. అని సంబరపడుతున్నారు. గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజైంది. చాలారోజుల తర్వాత మహేశ్ ఫుల్ మాస్ లుక్కులో కనిపించాడు. కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో స్టెప్పులైతే ఇరగదీశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజైన మొదటి వారంలో రూ.212 కోట్లు రాబట్టింది. తమన్ సంగీతం అందించగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించాడు.
కథేంటంటే?
జనదళం పార్టీ నాయకుడు వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాటా మధు (రవి శంకర్) తనకే మంత్రి పదవి కావాలంటాడు. అందుకు ఒప్పుకోకపోతే వసుంధరకు మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని, రెండో పెళ్లి విషయాన్ని బయటపెడతానని బెదిరిస్తాడు.
దీంతో ముందు జాగ్రత్తగా సూర్యనారాయణ.. వసుంధ మొదటి భర్త కొడుకు రమణ(మహేశ్‌బాబు)ను పిలిచి.. తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్‌పై సంతకం చేయాలంటాడు. ఇందుకు రమణ ఒప్పుకోడు. గుంటూరులో ఉంటూ మిర్చి యార్డ్ నడిపిస్తూ ఉంటాడు. అసలు వసుంధర మొదటి భర్తకు ఎందుకు విడాకులిచ్చింది? రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? చివరకు రమణ తన తల్లి ప్రేమ పొందాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment