నటి మహీ విజ్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటుచేసుకుంది. గత వారం ఆమె సోదరుడు కరోనాతో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడుతున్న సమయంలో తన సోదరుడికి ఆస్పత్రిలో బెడ్ సౌకర్యం కల్పించినందుకు మహీ విజ్ సోషల్ మీడియా వేదికగా రియల్ హీరో, నటుడు సోనూ సూద్, ఆయన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని ఆశలు కోల్పోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న తనకు సోనూసూద్ తిరిగి ఆశను పెంచారని, తన సోదరుడికి ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్ సదుపాయం కల్పించారని తెలిపారు. అంతేగాక ప్రతి రోజు అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడినట్లు ఆమె చెప్పారు.
మహీ విజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోనూసూద్, తన సోదరుడి గురించి చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ షేర్ చేశారు.‘ మేము అన్ని ఆశలు కోల్పోయిన పరిస్థితిలో సోనూసూద్ సర్ మాలో ధైర్యాన్ని నింపారు. నేను, నా కుటుంబం మీకు ఎప్పటికి రుణపడి ఉంటాం సర్. మీ బలానికి, నిజాయితీగా సహాయం చేస్తున్న మీ దయగల హృదయానికి ధన్యవాదాలు’ అంటు ఆమె రాసుకొచ్చారు. కాగా సోనూసూద్ ఆమె సోదరుడి గురించి ట్వీట్ చేస్తూ.. ‘మేము 25 ఏళ్ల యువకుడిని కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించాం. కానీ అతడు ఈ రోజు కోవిడ్‌తో పోరాడి ఓడిపోయాడు. అతడు బతికే అవకాశం తక్కువ ఉందని తెలిసి కూడా మేము అతడిని బతికేంచేందుకు ప్రయత్నించాను. రోజు వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేవాడిని.
ఈ నిజాన్ని తట్టుకునే శక్తి అతడి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కలగాలని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. కాగా మహీ విజ్ తన సోదరుడి మరణాంతరం ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. ‘నేను నిన్ను ఎప్పటికి కోల్పోను. నువ్వే నా ధైర్యం లవ్ యూ బేబీ బ్రో. నేడు, ఎప్పటికి.. తిరిగి మిమ్మల్ని కలిసే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ భావోద్యేగంతో రాసుకొచ్చారు. కాగా మహీ విజ్ ‘లాగి తుజ్సే లగన్’లో నకుషా, ‘బాలిక వధు’లో నందినిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత మహీ, తన భర్త జే భానుశాలి 2013లో నాచ్ బలియే 5 డాన్స్ రియాలిటీ షో టైటిల్‌ను గెలుచుకున్నారు. ‘తూ, తూ హై వాహి (డిజె అకీల్ మిక్స్)తో సహా పలు మ్యూజిక్ వీడియోలలో ఆమె నటించారు. 2006లో ప్రసారమైన టీవీ సిరీస్ అకెలాలో ఆమె మహిళా ప్రధాన పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment