ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘విశేషం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్‌లో గ్లామర్ ఉండాలి అని నమ్మే దర్శకులు నేడు ఎక్కువ. కానీ కంటెంట్‌కు గ్లామర్ కన్నా గ్రామర్ ఎక్కువ అలరిస్తుందని నిరూపించారు మలయాళ దర్శకుడు సూరజ్ టామ్. అదెలాగంటారా? అయితే ఇటీవల ప్రైమ్ వీడియో ఓటీటీ ద్వారా విడుదలైన ‘విశేషం’ సినిమాపై ఓ లుక్కేద్దాం.
మామూలుగా సినిమా అంటే చక్కటి కథ, కామెడీతో పాటు చూడచక్కని పాత్రధారులు కూడా ఉండాలి. ‘విశేషం’ సినిమాకి కథ, కామెడీ ఉన్నాయి కానీ డీ గ్లామరైజ్డ్ హీరో, హీరోయిన్లు ఉంటారు. దానితో పాటు ఇదో సందేశాత్మక చిత్రం. ఇంకేముంది... దీంట్లో విశేషం అనుకోకండి. అసలైన విషయమున్న విశేషం ఏంటంటే... శీజు భక్తన్ మొదటి పెళ్లి జరిగిన కొన్ని నిమిషాల్లోనే పెటాకులవడంతో రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎన్నో విపరీత, వినోద ప్రయత్నాల తర్వాత కానిస్టేబుల్ సజితతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. సజితది కూడా రెండో వివాహమే. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడ నుండే దర్శకుడి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యను ఈ సినిమా ద్వారా హృద్యంగా చూపించారు దర్శకుడు. అదే సంతానలేమి సమస్య. మరీ ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో పిల్లలు లేకపోవడం అనేది కొంతమంది దంపతుల్లో విపరీత సమస్య.
సంతానం లేని దంపతులు తమ కుటుంబంలో, సమాజంలో తమ సమస్య వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారో కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల సమస్య సంతాన లేమి అయితే దానిని పరిష్కరించడంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? అనే కోణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు. ఎంతో సున్నితమైన సమస్యను అంతే సున్నితంగా ఎవ్వరినీ నొప్పించకుండా రూపొందించారు సూరజ్ టామ్.
సినిమా చివర్లో శీజు భక్తన్, సజితలకు ఉన్న సమస్య ఎలా పరిష్కారమైంది? ఎలా పరిష్కరించుకున్నారు? అనే విషయం మాత్రం ఈ ‘విశేషం’లోనే చూడాలి. రోజూ మనం ఎన్నో మెసేజ్‌లు, వీడియాలు మన దగ్గరివారికి షేర్ చేసుకుంటాం. ఈ సినిమా గురించి మనం పది మందికి చెబితే అందులో ఎవరైనా ఈ సమస్య బాధితులు ఉంటే వారికి వినోదంతోపాటు కొంత బాసటగా ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే ఇది విషయమున్న విశేషం కాబట్టి.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment