మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఈ నివేదికలో పేర్కొనడంతో ఇందుకు నైతిక బాధ్యత వహించి, ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో పాటు కమిటీ సభ్యులందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా హేమా కమిటీ నివేదికపై ఆల్రెడీ మోహన్‌లాల్ స్పందించారు. తాజాగా మరో అగ్రనటుడు మమ్ముట్టి ఈ అంశం గురించి సోషల్ మీడియాలో సుధీర్ఘమైనపోస్ట్‌ను షేర్ చేశారు. ఈపోస్ట్ సారాంశం ఈ విధంగా...
⇒ ఓ సంస్థకు సంబంధించి ఒక విధానం ఉంటుంది. మొదట నాయకత్వం స్పందించిన తర్వాతే సభ్యులు మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను ‘అమ్మ’లో సభ్యుడిని మాత్రమే. అందుకే నేను కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాను.
⇒సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. సమాజంలో జరుగుతున్న మంచి చెడులు సినిమాల్లోనూ ఉంటాయి. అయితే సినిమాలపై సమాజం దృష్టి చాలా దగ్గరగా ఉంటుంది. జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనిస్తుంటారు. ఒక్కోసారి చిన్న అంశాలు కూడా పెద్ద స్థాయి చర్చలకు కారణమవుతుంటాయి. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
⇒ ఓ దురదృష్టకర సంఘటన (2017లో జరిగిన దిలీప్– భావనా మీనన్‌ల ఘటనను ఉద్దేశించి కావొచ్చు) జరిగిన నేపథ్యంలో ఇండస్ట్రీపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని నియమించింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, సలహాలు, పరిష్కారాలను స్వాగతిస్తున్నాం. అయితే ఈ అంశాలను అమలు చేయడానికి మలయాళ చిత్ర పరిశ్రమలో అన్ని అసోసియేషన్‌లు ఏకతాటి పైకి రావాలి. ఇక హేమా కమిటీ పూర్తి నివేదిక కోర్టులో ఉంది. కమిటీకి అందిన ఫిర్యాదులపైపోలీసులు నిజాయితీగా విచారణ చేస్తున్నారు. దోషులను కోర్టు శిక్షిస్తుంది. హేమా కమిటీ సిఫార్సులు అమ్మలయ్యేలా చట్టపరమైన కార్యాచరణ జరగాలి... అంతిమంగా సినిమా బతకాలి.
Comments
Please login to add a commentAdd a comment