తిరువళ్లూరు: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ ప్రభుత్వ వైద్యశాలలో చిక్సిత పొందిన ప్రముఖ హాస్యనటుడు బోండా మణి అకౌంట్ నుంచి రూ. 1.04 లక్షలు కొట్టేసిన యువకుడిని పది రోజుల తరువాత పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని అయ్యప్పన్ తాంగల్ వీజీఎన్ నగర్‌లో ప్రముఖ హాస్యనటుడు బోండామణి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై ఓమందూరార్ ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. వంద సినిమాలకు పైగా నటించిన బోండా మణి చికిత్స కోసం ఆర్థికంగా పలువురు దాతలను సాయం కోరాడు. ఇతడికి ధనుష్, విశాల్, మాజీ మంత్రి జయకుమార్‌తో సహా పలువురు దాతలు ఆర్థిక సాయం అందించారు.
ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం సైతం నేరుగా పరామర్శించి మెరుగైన చికిత్స అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దాతలు చేసిన సాయంతోనే ప్రస్తుతం మందులు తదితర వాటికి ఖర్చు చేస్తున్నారు. అయితే బోండామణి వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్న సమయంలో తిరుప్పూర్ జిల్లా వీరపాండి ప్రాంతానికి చెందిన రాజేష్ ప్రదీవ్ (34) అభిమానిగా పరిచయం చేసుకుని వైద్యశాలలో సాయం చేసినట్లు తెలిసింది. బోండామణి ఆరోగ్యం కుదుట పడడంతో సెప్టెంబర్ 27న డిశ్చార్జ్ అయ్యారు. ఆయనతో పాటు రాజేష్‌ప్రదీవ్ సైతం మణి ఇంటికి వచ్చాడు. అదే రోజు బోండామణి భార్య మాధవి తన ఏటీఎం కార్డును రాజేష్‌కు ఇచ్చి మందులను తీసుకుని రావాలని సూచించింది.
అయితే కార్డుతో వెళ్లిన కొద్ది సమయానికే చెన్నైలోని ఓ నగల దుకాణంలో రూ.1.04 లక్షలకు నగలు కొన్నట్లు మణి సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో మాధవి షాక్‌కు గురైంది. అనంతరం రాజేష్ తన ఫోన్‌ను స్వీచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు. ఈ సంఘటనపై మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజేష్‌ను అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు దినేష్, శివరామగురు, ధీనదయాళన్, రాజేష్, పెరుమాల్ తదితర పేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇతడిపై కోవై, ఎగ్మూర్, విల్లివాక్కం, ఈరోడ్ తదితర ప్రాంతాల్లో చీటింగ్ చైన్‌స్నాచింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. మరింత సమాచారం కోసం దర్యాప్తును ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment