‘‘నాకు ఉన్నదంతా ఊడ్చి ‘మోసగాళ్ళు’ సినిమాకి పెట్టేశా.. అందుకే రెండు వారాలుగా ఒత్తిడిగా ఉంది. ఏ సినిమా తీసినా అందరికీ భయం ఉంటుంది. సినిమా విడుదల రోజు ఎవరికైనా ఆందోళన ఉంటుంది’’ అని మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీచిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో విష్ణు విలేకరులతో చెప్పిన విశేషాలు...
► అమెరికాలో జరిగిన ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. ఈ కథపై నమ్మకంతో నాకున్న మార్కెట్ విలువ కంటే రెండు రెట్లు అధికంగా ఖర్చు పెట్టాను. బాగా ఆడి మంచి వసూళ్లు సాధిస్తేనే సేఫ్. ఈ సినిమా విషయంలో నన్ను నమ్మి, ప్రోత్సహించింది మా నాన్నగారు (మోహన్ బాబు), నా భార్య విరానికా. సినిమా కోసం అప్పులు కూడా తెచ్చాను. వడ్డీలు పెరిగిపోతున్నాయి. నా ఆందోళన చూసి వాళ్లు కూడా ఒత్తిడికి లోనయ్యేవారు. నాపై నాకే కోపం వచ్చింది.
► ఈ సినిమా మొదటి డ్రాఫ్ట్ కథ నేనే రాశాను. ఆ తర్వాత రచయిత ‘డైమండ్’ రత్నబాబు సపోర్ట్ తీసుకున్నాను. ఓ బస్తీలో ఉండే అక్క–తమ్ముడు తెల్లవాళ్లని మోసం చేసి, ఆన్ లైన్ మోసం ద్వారా అమెరికాలోని కొన్ని వేల మంది కుటుంబాలను నాశనం చేస్తారు. తెల్లవాళ్లందరూ ధనవంతులే అనుకుంటారు వారు. కానీ పేదవాళ్లు కూడా వీళ్ల బారిన పడి మోసపోతుంటారు.
► అమెరికాలో ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నా. ఈ కుంభకోణానికి సంబంధించి పేపర్లో వచ్చిన వార్తల హక్కుల్ని కూడా మేం కొన్నాం. అక్కడ సినిమాతో పాటు సాంకేతిక నిపుణులకు ఇన్సూరెన్స్ చేయించాం. వీటికే 20శాతం బడ్జెట్ అయింది. హాలీవుడ్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేస్తారు. మన దృష్టిలో నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడు. వాళ్ల దృష్టిలో డబ్బులు పెట్టేవాణ్ణి స్టూడియో ఫైనాన్షియర్ అంటారు. నిర్మాతను వాళ్లు ఎంచుకుని జీతం ఇచ్చి, ఎగ్జిక్యూట్ చేయమని అంటారు. భవిష్యత్‌లో పెద్ద బడ్జెట్ సినిమా తీస్తే హాలీవుడ్ నుంచి నిర్మాతను తీసుకొస్తాను.
► ఈ సినిమాని ముందు ఇంగ్లీష్‌లోనే చేద్దామనుకున్నాం. అయితే భారీ బడ్జెట్ పెడుతున్నాం కదా తెలుగులోనూ తీస్తే సేఫ్ అవుతామని రెండు భాషల్లోనూ తెరకెక్కించాం. యూఎఫ్‌ఓ వారు మా సినిమాని ఇండియా మొత్తం విడుదల చేస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో 40 థియేటర్లలో సినిమా విడుదలవుతుంటే వాటిలో 30 థియేటర్లలో తెలుగు వెర్షనే రిలీజ్ చేస్తున్నాం. నాకు తెలుగు–కన్నడ భాషల్లో మంచి మార్కెట్ ఉంది. కన్నడంలో 130 థియేటర్లలో రిలీజవుతుండగా 30 థియేటర్లలో మాత్రమే కన్నడ డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతోంది. మలయాళంలో నా డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది. సునీల్ శెట్టి, కాజల్ ఉండటంతో హిందీ, తమిళాల్లోనూ రిలీజ్ చేస్తున్నాం.
► మంచి కథ కుదిరితే మా కుటుంబమంతా కలసి నటించడానికి అభ్యంతరం లేదు. నా తర్వాతి సినిమా ‘డీ అండ్ డీ’ కోసం దర్శకుడు శ్రీను వైట్ల వల్ల రోజుకి ఐదు గంటలు జిమ్‌లోనే కష్టపడుతున్నా. ఏప్రిల్‌లో సెట్స్‌కి వెళుతుంది. 3 వెబ్ సిరీ స్‌లు నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయి.
‘మోసగాళ్ళు’ సినిమా రఫ్ వెర్షన్ చూసిన నాన్నగారు కొన్ని సందేహాలు వ్యక్తపరిచారు. కొన్ని సన్నివేశాలు నాన్నకే అర్థం కాలేదంటే సాధారణ ప్రేక్షకులకు ఏం అర్థం అవుతుంది? అనిపించి అందరికీ సులభంగా అర్థం అయ్యేలా ఐదు సన్నివేశాలు యాడ్ చేశాం. ‘మోసగాళ్ళు’ ఇంగ్లీష్ వెర్షన్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మేలో పూర్తి చేయాలనుకుంటున్నాం.
అప్పులు చేశా.. నాపై నాకే కోపం వచ్చింది : మంచు విష్ణు
Published Thu, Mar 18 2021 12:26 AM | Last Updated on Thu, Mar 18 2021 10:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment