‘‘జిన్నా’ ని రెండు షోలు ప్రివ్యూ వేశాం.. చూసిన వారందరూ విపరీతంగా ఎంజాయ్ చేశారు. మా అమ్మ, అత్తగార్లు కూడా చప్పట్లు కొట్టేసి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. అప్పుడు వచ్చిన నమ్మకంతోనే ‘జిన్నా’ని ఎక్కువగా ప్రమోట్ చేశాను. నేను, ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర సెకండాఫ్‌లో కడుపుబ్బా నవ్విస్తాం.. నవ్వి నవ్వి ప్రేక్షకులకు కడుపునొస్తుంది’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు పంచుకున్న విశేషాలు...
►మా నాన్న(మోహన్ బాబు) ‘జిన్నా’ చిత్రాన్ని ‘ఢీ’ సినిమాతో పోల్చారు. ‘ఢీ’ చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాం. విడుదలయ్యాక అది కల్ట్ సినిమా అయింది. ‘ఢీ’లో ఇంటర్వెల్‌కు అంత సర్‌ప్రైజ్ అనిపించదు. కానీ, ‘జిన్నా’లో ఇంటర్వెల్‌కు అందరూ సర్‌ప్రైజ్ షాక్ అవుతారు. అయితే ‘జిన్నా’’ మూవీ ‘ఢీ’ రేంజ్‌లో సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ∙యాక్షన్ కామెడీ జానర్‌లో నేను చేసిన సినిమాలన్నీ హిట్లు ఇచ్చాయి. మధ్యలో వేరే జానర్స్ ప్రయత్నించి, తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసమే ‘జిన్నా’ చేశా. ప్రతి సినిమా బాగుండాలనే అందరూ అనుకుంటాం.. కానీ, ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ∙‘జిన్నా’లో నా పాత్ర పేరు గాలి నాగేశ్వరావు. జీనా అని పిలిస్తే బాగుండదు.. అందుకే జిన్నా అని పెట్టాం. జిన్నా అప్పు చేసి
టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు అప్పు ఎలా తీర్చాడు?. అన్నదే ఈ చిత్ర కథ.
∙
► ‘పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలకు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అని నాన్నని అడిగాను. ‘ప్రిపరేషన్ లేదు.. మన పాత్ర చెబుతారు.. దాన్నే
దృష్టిలో పెట్టుకుని చేయాలి’ అని ఆయన చెప్పడంతో షాక్ అయ్యాను. ‘జిన్నా’ కోసం నేను చిత్తూరు యాస మాట్లాడాల్సి వచ్చింది.. దాని కోసం కష్టపడ్డాను. జి.నాగేశ్వరరెడ్డిగారు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి శ్రీనువైట్లగారి అసిస్టెంట్ సూర్యను డైరెక్టర్‌గా తీసుకున్నాం.
► ఈ చిత్రానికి మూల కథ జి.నాగేశ్వరరెడ్డిగారు అందించారు. ‘జిన్నా’ కోసం కోన వెంకట్‌గారు ప్రతి రోజూ పని చేశారు.. ఆయనకు చాలా థ్యాంక్స్. మనకు జనాలతో కనెక్షన్ ఉండాలంటే సోషల్ మీడియాలో ఉండక తప్పదు. అయితే ఇందులో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిందే. ∙‘జిన్నా’తో నా కెరీర్‌లో ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు అనూప్ రూబె¯Œ ్స. ఈ చిత్రంలో చిన్నపిల్లల ట్రాక్‌ని నా కుమార్తెలు అరియానా, వీవీయానా పాడాలనే ఆలోచన నాదే. దీనిపై అనూప్ తొలుత సందేహపడ్డా, వారి పాట విన్నాక సంతోషించాడు. భవిష్యత్తులో వాళ్లు మంచి సింగర్లు కావాలని కోరుకుంటున్నాను.. కానీ వాళ్లకి నటీమణులు కావాలని ఉంది.
►నేను నటించే సినిమాలు మా అమ్మ, నా పిల్లలతో కలిసి చూసేలా ఉండాలనుకుంటున్నా. ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌లు డ్యాన్స్ విషయంలో బాగా కష్టపెట్టారు. నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్స్, డ్యాన్స్‌లు ‘జిన్నా’ లో ఉన్నాయి.
► కొన్ని సినిమాల రీమేక్ హక్కులు కొన్నాను. మా ప్రొడక్షన్‌లో వేరే హీరోలతోనూ ఆ సినిమాలు చేస్తాను. నవంబర్‌లో ఆ చిత్రాల గురించి ప్రకటిస్తాను. ప్రస్తుతానికి యాక్షన్ కామెడీ జానర్‌లోనే సినిమాలు చేయాలనుకుంటున్నాను. శ్రీను వైట్లగారు, నేను కలిసి చేయనున్న చిత్రం జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి చర్చలు జరుగుతున్నాయి.
► ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) టీమ్‌లో అంతా మంచి వాళ్లున్నారు. వారు బాగా పని చేస్తుండటంతో నేను ఓ వైపు హీరోగా, మరోవైపు ‘మా’ అధ్యక్షునిగా ప్రశాంతంగా ఉంటున్నాను. ‘మా’ అధ్యక్షునిగా మళ్లీ పోటీ చేయనన్నాను. నా కంటే ఇంకా మంచి ప్రెసిడెంట్ రావొచ్చేమో? ఒక వేళ ఇండస్ట్రీ పెద్దలు మళ్లీ నన్ను చేయమంటే చేస్తాను. అయితే ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదని నా అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment