టైటిల్: మట్కా
నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
నిర్మాణ సంస్థ: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
దర్శకత్వం: కరుణ కుమార్
సంగీతం: జీవీ ప్రకాశ్
సినిమాటోగ్రఫీ: ఎ కిశోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
విడుదల తేది: నవంబర్ 14, 2024
కథేంటంటే..
బర్మా నుంచి వైజాగ్ వచ్చిన వాసు దేవ్ అలియాస్ వాసు(వరుణ్ తేజ్)..చిన్నప్పుడే అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్ నారాయణ మూర్తి(రవిశంకర్)తో మంచి పరిచయం ఏర్పడుతుంది. వాసుని తన సొంత పనులకు వాడుకుంటూ మంచి ఫైటర్‌లా తయారు చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన వాసు.. కొప్పరికాయల వ్యాపారి అప్పల రెడ్డి(అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరతాడు. ఓ సారి ఆ ఏరియా రౌడీ కేబీఆర్ గ్యాంగ్‌ని చితక్కోట్టి..అతని ప్రత్యర్థి నానిబాబు(కిశోర్)కి దగ్గరవుతాడు. అతని అండదండలతో పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదుగుతాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. చివరకు మాట్కా ఆటను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాసు జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మట్కా కింగ్‌గా ఆయన ఎలా ఎదిగాడు? సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని ఎలా పంపించాడు? వాసు కోసం సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సుజాత(మీనాక్షి చౌదరి) వాసు జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ కథలో సోఫియా(నోరా ఫతేహి), సాహు(నవీన్ చంద్ర) పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘మట్కా కింగ్’ రతన్ లాల్ ఖత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మట్కా’. గ్యాoబ్లింగ్ వరల్డ్ లో రతన్ ఖత్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1962లో ముంబైలో కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ లో దేశం మొత్తం పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేసి మట్కా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కరుణ కుమార్. కథగా చూస్తే ఇది కేజీయఫ్, పుష్ప లాంటి అండర్ డాగ్ స్టోరీ.
చేతిలో చిల్లిగవ్వ లేని హీరో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి..ప్రభుత్వాలనే శాసించే స్థితికి రావడం.. గ్యాంగ్‌స్టర్ కథలన్నీ ఇలానే ఉంటాయి. మట్కా కథనం కూడా ఇలానే సాగుతుంది. అయితే ఓ ఆటను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడనేది కొత్త పాయింట్. కథకు ఇదే మెయిన్ పాయింట్ కూడా. కానీ తెరపై మాత్రం దాన్ని అంతే బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా కథనాన్ని నడిపించాడు.
హీరో మట్కా కింగ్‌గా ఎదిగిన క్రమం కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది కానీ ఎక్కడా సహజంగా కనిపించదు. ఇక కథకి కీలకమైన మట్కా ఆట కూడా ఇంటర్వెల్ వరకు మొదలు కాదు. సెకండాఫ్‌లో అయినా ఆ ఆటని హైలెట్ చేశారా? అంటే అదీ లేదు. కథనం మొత్తం రొటీన్‌గా సాగుతుంది. హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. ఫస్టాఫ్ మొత్తం హీరో బాల్యం, అతను ఎదిగిన క్రమం చూపిస్తూ.. మట్కా ఆటలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారనే చూపించారు. ఇక సెకండాఫ్‌లో మట్కా ఆటతో వాసు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడు? అతన్ని పట్టుకునేందుకు సీబీఐ రంగంలోకి దిగడం..మరోవైపు ప్రత్యర్థులు అతన్ని చంపేందుకు కుట్ర చేయడం.. వాటిని హీరో ఎలా తిప్పికొట్డానేది చూపించారు. అయితే ఈ సన్నివేశాలేవి ఆకట్టుకునేలా ఉండవు. చివరల్లో దావూద్ పాత్రని పరిచయం చేసి.. క్రికెట్ బెట్టింగ్‌తో సీక్వెల్ ఉంటుందని పరోక్షంగా ప్రకటించారు.
ఎవరెలా చేశారంటే..
వాసు పాత్రకి వరుణ్ తేజ్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. వాసు భార్య సుజాతగా మీనాక్షి చౌదరి తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. సోఫియాగా నోరా ఫతేహి తెరపై అందంగా కనిపించింది. కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
-రేటింగ్: 2.25/5
Comments
Please login to add a commentAdd a comment