మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కేడీ జార్జ్ అనారోగ్యంతో డిసెంబర్ 29న మరణించాడు. తనను చివరి చూపు చూసుకోవడానికి, అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు, బంధువులెవరూ ముందుకు రాలేదు. రెండు వారాలుగా మార్చురీలోనే ఆయన శవం కుళ్లిపోతోంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని సంప్రదించింది. ప్రభుత్వ జోక్యంతో సంక్రాంతి పండగరోజే ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు.
సొంతిల్లు.. వెళ్లడానికి డబ్బు లేదు
జార్జ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ నిర్మాత జి. శిబు సుశీలన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. '1993లో ఏవీఎమ్ స్టూడియోలోని ఎడిటింగ్ రూమ్‌లో తొలిసారి జార్జ్‌ను కలిశాను. సినిమాలపై ఆసక్తితో అతడు చెన్నై నుంచి కేరళ వచ్చేశాడు. గంభీరమైన కంఠంతో మాట్లాడే అతడి స్వరాన్ని ఇట్టే గుర్తుపట్టవచ్చు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పేరు గడించాడు. తనకు చెన్నైలో సొంతిల్లు ఉంది. కానీ అక్కడికి వెళ్లడానికి డబ్బు లేదని ఆయన నాతో చెప్పిన మాట నాకింకా గుర్తుంది. సినిమాల ద్వారా తనకు పెద్దగా డబ్బులు వచ్చేవి కావు. సొంతింటికి వెళ్లి బతకాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది.
డిసెంబర్ 27న ఆస్పత్రిలో..
కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఫెఫ్కా(డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్) వంటి కొన్ని సంస్థల సాయం వల్ల బతుకుబండి లాగించాడు. ఆ తర్వాత తిరిగి సినిమా ప్రాజెక్టులు చేశాడు. డిసెంబర్ 27 సాయంత్రం అతడు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందింది. వెంటనే మా యూనియన్‌తో మాట్లాడి తనకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించాం. వెంటనే అతడిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. కానీ తను పోరాటం చేసీచేసీ అలిసిపోయాడు.
అనాథ శవంలా..
డిసెంబర్ 29న కన్నుమూశాడు. అతడు చనిపోయి 16 రోజులపైనే అవుతున్నా తన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అంత్యక్రియల బాధ్యతను భుజానెత్తుకుంది. కానీ అనాథ శవాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. బంధువులు ఎవరో ఒకరు వస్తేనే మృతదేహాన్ని అప్పజెప్తామంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు జనవరి 15న ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి' అని తెలిపాడు.
చదవండి: చరణ్-ఉపాసనల కూతురిపై స్పెషల్ సాంగ్ రిలీజ్..
Comments
Please login to add a commentAdd a comment