కరోనా సెకండ్ వేవ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించి ఎనలేని సేవలందించారు మెగాస్టార్ చిరంజీవి. మహమ్మారి నుంచి సినీ కార్మికులను కాపాడేందుకు కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) కూడా ప్రాంభించారు. అంతేగాక ఆర్టిస్టులు సహా 24 శాఖల కార్మికుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇలా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు ఆయన. తాజాగా సినీ కార్మికుడి కుటుంబానికి చెందిన ఓ తల్లి బిడ్డలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకుంది. చికిత్సకు రక్తం అందక ఆ తల్లిబిడ్డలు బాధపడుతుంటే సకాలంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడారు. సినీ కార్మికుల కోసం ఆయన చేసిన సేవలకు గాను చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సినీ పరిశ్రమ కార్మిక సమాఖ్య ఫెడరేషన్ చిరంజీవికి లేఖ రాసింది.
‘చిరంజీవి గారు.. మీరు మన సినీ కార్మికులకు ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. మీరు చేసే ప్రతి సేవ జీవితాంతం గుర్తుంటుంది. అందులో భాగంగా.. భాస్కర్ అనే సినీ కార్మికుని భార్య డెలివరీ సమయంలో చావు బ్రతుకులలో ఉండగా తల్లి బిడ్డలకు రెండు దఫాలుగా బ్లడ్ ఇచ్చి బ్రతికించిన మీకు మా పాదాభివందనాలు’ అని లేఖలో పేర్కొన్నారు. ఇక రక్తదానం కోసం అర్ధరాత్రి వెళ్ళి సమయంలో కూడా వెంటనే స్పందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున అధ్యక్షుడు అనీల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి పీఎస్‌ఎన్ దొరలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment