న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సుశాంత్ జీవితం ఆధారంగా ఎవరినీ సినిమాలు తియ్యనీయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. గురువారం అందులోని వివరణను పరిశీలించిన కోర్టు పిటిషన్ను కొట్టేసింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ జీవితం, మరణం గురించి దాదాపుగా అన్ని మీడియా హౌజ్ల ద్వారా జనాలకు తెలిసిపోయింది. ఈ తరుణంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అనే ప్రస్తావన ఉండకపోవచ్చనే జస్టిస్ సంజీవ్ నరులా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు తన కొడుకు విషయంలో కిషోర్ సింగ్ ప్రస్తావించిన ‘ పబ్లిసిటీ రైట్’ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఆ హక్కు సెలబ్రిటీ చనిపోయాక ఉంటుందా? ఉండదా? అనే విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, అంతమాత్రాన సినిమా తీస్తే ప్రైవసీకి భంగం కలిగించినట్లు కాదని బెంచ్ వ్యాఖ్యానించింది.
రిలీజ్ తర్వాత రండి
ఇదిలా ఉండగా సుశాంత్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘న్యాయ్ ది జస్టిస్’ ఇవాళ(శుక్రవారం) రిలీజ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే కృష్ణ కిషోర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు సుశాంత్ లైఫ్ ఆధారంగానే ‘సూసైడ్ ఆర్ మర్డర్’, ‘ఎ స్టార్ వాజ్ లాస్ట్’, ‘శశాంక్’, క్రౌడ్ఫండ్తో తీస్తున్న మరో సినిమా.. ఇలా వరుసగా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న తన కొడుకు జీవితాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దర్శకనిర్మాతలు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారని కృష్ణ కిషోర్ సింగ్ వాదిస్తున్నాడు. అయితే ‘సినిమా స్వేచ్ఛ’ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు నిర్మాతలకు నష్టం కలిగించే ఈ అంశంపై త్వరగతిన నిర్ణయం తీసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమను ఆశ్రయించవచ్చని కోర్టు సుశాంత్ తండ్రికి సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment