టైటిల్: మిస్టర్ బచ్చన్
నటినటులు:రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సత్య, చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ తదితరులు
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం:హరీశ్ శంకర్
సంగీతం:మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ:అయానక బోసే
విడుదల తేది: ఆగస్ట్ 15, 2024
కథేంటంటే..
మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే...
ఓ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయడం ఇప్పుడు కత్తిమీద సాము లాంటిదే. ఓ స్టార్ హీరో ఓ రీమేక్ చేస్తున్నాడంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే ఓటీటీలో వెతికి మరీ చూసేస్తున్నారు. ఆ తర్వాత రీమేక్ సినిమాను ఒరిజినల్‌తో పోల్చి చూస్తున్నారు. ఏమాత్రం తక్కువగా అనిపించినా విమర్శలు తప్పవు. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ విషయంలో మాత్రం సినీ ప్రియులకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన నుంచి ఓ రీమేక్ సినిమా వస్తుందంటే..కచ్చితంగా ఒరిజినల్‌కు మించిన చిత్రంగా ఉంటుందని గట్టి నమ్మకం. ఆ నమ్మకానికి కారణం గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలే. ఒరిజినల్‌ను ఉన్నదున్నట్లు తీయకుండా మార్పులు చేర్పులు చేసి.. మసాలా అద్ది సినిమా రూపు రేఖలే మార్చేశాడు. అందుకే ఆ రెండూ సూపర్ హిట్‌గా నిలిచాయి.
మిస్టర్ బచ్చన్ విషయంలోనూ హరీశ్ అలానే మార్పులు చేశాడు కానీ.. అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్’ మూవీ సారాన్ని మాత్రమే తీసుకొని..దాని చుట్టు కామెడీ,రొమాంటిక్ సీన్లు అల్లుకొని మిస్టర్ బచ్చన్‌ని తెరకెక్కించాడు. అయితే ఫన్ కోసం యాడ్ చేసిన కొన్ని సీన్లు నవ్వించకపోగా..అక్కడ అవసరమా అన్నట్లుగా కథనం సాగుతుంది.
ముఖ్యంగా అన్నపూర్ణమ్మ ఎపిసోడ్, చమ్మక్ చంద్రతో వచ్చే సీన్లు.. ‘ఓహో..మనం ఇక్కడ నవ్వాలేమో..’ అని అనిపిస్తుంది. సినిమా మొత్తంగా చూస్తే..లవ్..కామెడీ..యాక్షన్ అన్నీ సమపాళ్లల్లో ఉంటాయి. అయితే అవి కథకు అనుగుణంగా కాకుండా..ఇరికించినట్లుగా అనిపిస్తుంది. అయితే బోర్ కొడుతున్నట్లుగా అనిపించిన ప్రతిసారి భాగ్యశ్రీని తెరపై చూపించి.. ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో మాత్రం హరీశ్ సక్సెస్ అయ్యాడు. భాగ్యశ్రీ అందాలను తెరపై ఎంతవరకు చూపించాలో..ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అవుతారో అలానే చూపించాడు. ఇక తన గత సినిమాల మాదిరే పాటల విషయంలో తన మార్క్‌ని చూపించాడు. మిక్కీ జే మేమయర్ నుంచి మంచి సంగీతాన్ని రాబట్టుకున్నాడు.
ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే కామెడీ జోన్‌లోకి వెళ్తుంది. రవితేజ పాత్రకు బచ్చన్ అనే పేరు పెట్టడం వెనుక ఉన్న స్టోరీ, జిక్కీతో ప్రేమాయణం..రొమాంటికి పాటలు..సత్య కామెడీతో ఫస్టాఫ్ సరద సరదాగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ సీన్‌తో అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం విలన్ ఇంట్లో హీరో చేసే రైడ్ చుట్టే కథనం సాగుతుంది.
అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు చేసే తనిఖీలు కానీ.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అన్నీ సినిమాటిక్‌గానే ఉంటాయి తప్పితే...ఎక్కడా వాస్తవికానికి దగ్గరగా అనిపించవు. పోనీ కామెడీ అయినా వర్కౌట్ అయిందా అంటే..ఆ సీన్లు మరింత బోర్ కొట్టిస్తూ సాగదీతగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభంలో జగపతి బాబుకి ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చి..మధ్యలో కమెడియన్‌కి ఎక్కువ..విలన్‌కి తక్కువ అన్నట్లుగా చూపించారు. విలనిజాన్ని పండించడంలో శంకర్ పూర్తిగా విఫలం అయ్యాడు. జగపతి బాబు పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే రైడ్ మూవీ చూడని వాళ్లకు, లాజిక్కులను పట్టించుకొని బీ, సీ సెంటర్ల ఆడియన్స్ మాత్రం మిస్టర్ బచ్చన్ అలరించే అవకాశం ఉంది.
ఎవరెలా చేశారంటే..
మిస్టర్ బచ్చన్ పాత్రలో రవితేజ జీవించేశాడు. తెరపై వింటేజ్ రవితేజను చూస్తారు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ఇక భాగ్యశ్రీ బోర్సే సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. జీక్కీ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అందాలను ప్రదర్శించడమే కాదు..చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. డ్యాన్స్ ఇరగదీసీంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. విలన్‌గా జగపతి బాబు బాగానే నటించాడు. అయితే ఆయన పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. సత్య తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక స్పెషల్ రోల్‌లో మెరిసిన సిద్ధు జొన్నలగడ్డ తనదైన స్టైల్లో యాక్షన్ సీన్ అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అవి తెరపై మరింత ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరోహీరోయిన్లను తెరపై అందంగా చూపించడమే కాకుండా..ప్రతీఫేమ్ చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment