
వయసుపైబడే కొద్దీ హీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక హీరోల్లో కూడా కొందరుపడే తాపత్రయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, సినిమా కోసం ఎంతటి కష్టానినైనా ఒర్చుకునే ‘డెడికేటెడ్ యాక్టర్స్’ కొందరే ఉంటారు. అలాంటి వాళ్లలో హాలీవుడ్ నటుడు బ్రెండన్ ఫ్రాజర్ ఒకరు. మమ్మీ సిరీస్ సినిమాలతో మనదగ్గరా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గుర్తుపట్టలేనంతలా మారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బ్రెండన్ ఫాజర్.. జార్జ్ ఆఫ్ ది జంగిల్, మమ్మీ, బ్రేక్ అవుట్ లాంటి సినిమాలతో వరల్డ్‌వైడ్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. 52 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్ శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ట్రైబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘నో సడన్ మూవ్’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యాడు. అయితే బయట ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆయనెవరో అనుకుని చాలాసేపు పట్టించుకోలేదు. చివరికి.. నటుడు డాన్ చెడల్ ఆయన దగ్గరికి రావడంతో.. అప్పుడు విషయం తెలుసుకుని ఫ్రాజర్‌ను క్లిక్ మనిపించారు.
ఫ్రాజర్ ప్రస్తుతం ‘ది వేల్’ అనే ప్రాజెక్టు చేస్తున్నాడు. కూతురికి దగ్గరవ్వాలని ప్రయత్నించే తండ్రి క్యారెక్టర్ అందులో ఆయనది. తన పార్ట్‌నర్ చనిపోయాక ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడే ఛార్లీ పాత్రలో ఫ్రాజర్ కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసమే ఇంత భారీగా లావుగా తయారయ్యాడు ఫ్రాజర్. 2018లో ఓ ఇంటర్వ్యూలో బ్రెండన్ ఫ్రాజర్ తన ఫెయిల్యూర్ ఫిట్‌నెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. రియల్ స్టంట్‌లకు కోసం తన ఒళ్లు హూనం చేసుకున్నానని, ఇకపై అలాంటి ప్రయోగాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు.
ఇక ఆరోగ్య సమస్యలతోనే 2014 నుంచి ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు ఫ్రాజర్. అంతేకాదు గతంలో తనకు చాలా సర్జరీలు జరిగాయని, వెనుక పిరుదుల దగ్గర భాగం తొలగించుకోవడం, వెన్నెముకకు సర్జరీ, మోకాలి చిప్ప రిప్లేస్‌మెంట్, గొంతు భాగంలో ఆపరేషన్‌లు చేయించుకున్నానని, వాటి ప్రతికూల ప్రభావమూ తన శరీరంపై పడిందని గుర్తు చేసుకుని బ్రెండన్ ఫ్రాజర్ బాధపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment