హారర్ కామెడీ స్టోరీలకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో కొన్నేళ్ల క్రితం ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే రీసెంట్ టైంలో హిందీలో ఇలా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'ముంజ్య'. తాజాగా ఇది హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
అది 1952. మహారాష్ట్రలో కొంకణ్ అనే ప్రాంతం. తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెకు పెళ్లి ఫిక్స్ కావడంతో చేతబడి చేసి వశం చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో తానే బలైపోతాడు. అప్పటి నుంచి 'ముంజ్య' అనే పిల్ల దెయ్యంగా మారిపోతాడు. ప్రస్తుతానికి వస్తే పుణెలో బిట్టు (అభయ్ వర్మ) తల్లి, నానమ్మతో కలిసి ఉంటాడు. కుక్కకి కూడా భయపడే ఇతడు.. కొంకణ్ ప్రాంతానికి వెళ్తాడు. అనుకోకుండా ముంజ్యని విముక్తి చేస్తాడు. అప్పటినుంచి బిట్టు జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైంది? అనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
కోరిక తీరని ఆత్మ, దెయ్యంగా మారడం.. ఓ వ్యక్తి వల్ల బయట ప్రపంచంలోకి రావడం.. అక్కడి నుంచి అందరినీ ముప్పతిప్పలు పెట్టడం.. చివరకు కోరిక తీర్చుకునే క్రమంలో చావడం... ఈ స్టోరీ లైన్ చెప్పగానే అనుష్క 'అరుంధతి' సినిమా గుర్తొచ్చి ఉంటుందేమో! దాదాపు ఇదే కథతో తీసిన హిందీ సినిమా 'ముంజ్య'. కాకపోతే అనుష్క మూవీ మొత్తం సీరియస్‌గా ఉంటే ఇది మాత్రం కాస్త భయపెడుతూ కాస్త నవ్వించే ప్రయత్నం చేసింది.
1952లో కొంకణ్ అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. గోట్య అనే పదేళ్ల పిల్లాడు, పక్కింట్లో ఉంటే మున్ని అనే అమ్మాయిని ఇష్టపడతాడు. కాకపోతే ఇతడి కంటే ఆమె ఏడేళ్లు పెద్దది. ఆమెకు పెళ్లి జరుగుతుందని తెలిసి.. ఏకంగా చేతబడి చేసి ఆమెని వశపరుచుకోవాలనుకుంటాడు. తన చెల్లినే బలివ్వాలనుకుంటాడు. ఇదంతా చెటుక్వాడి అనే దీవిలో చేస్తాడు. అనుకోకుండా అప్పుడు గోట్యా చనిపోతాడు.. పిల్ల దెయ్యంగా మారతాడు. ఇలా నేరుగా కథలోకి వెళ్లిపోయారు.
ప్రస్తుతానికి వస్తే చాలా భయస్తుడైన బిట్టు(అభయ్ వర్మ)కి అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. అందులో ముంజ్య కనిపిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో చెటుక్వాడి వెళ్లి అక్కడే నిర్బంధంలో ఉన్న ముంజ్యని విడుదల చేసేస్తాడు. అప్పటినుంచి ముంజ్య.. బిట్టు వెంటపడతాడు. తనకు మున్నితో పెళ్లి చేయాలని తెగ వేధిస్తాడు. అక్కడి నుంచి మొదలైన కథ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.
పాయింట్ బాగానే ఉన్నప్పటికీ భయపెట్టే సీన్స్ అక్కడక్కడే ఉన్నాయి. హాలీవుడ్ మూవీ 'ద లార్డ్ ఆఫ్ రింగ్స్'లోని గోలుమ్ అనే పాత్రని స్ఫూర్తిగా తీసుకుని.. ముంజ్య అనే పిల్ల దెయ్యాన్ని సృష్టించారు. నిజంగానే దెయ్యమా అనే రేంజులో గ్రాఫిక్స్ ఉన్నాయి కానీ దానితో పెద్దగా భయపెట్టలేకపోయారు. రెండు గంటల సినిమానే కానీ కొన్నిచోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. ఇందులో బెలా పాత్రలో శర్వరి అనే అమ్మాయి చేసింది. ఈమె పెద్దగా ఇంపార్టెన్స్ లేదేంటా అనుకుంటాం. కానీ చివర్లో దెయ్యాన్ని చేసి భయపెట్టాలని చూశారు. కానీ ఆ పార్ట్ అంతా ఓకే ఓకే.
ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అభయ్ వర్మ యాక్టింగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిగతా పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు. కాబట్టి ఉన్నంతలో న్యాయం చేశారు. రీసెంట్ టైంలో హారర్ సినిమాలేం చూడలేదు. టైమ్ పాస్ అవ్వాలి అనుకుంటే హిందీలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ముంజ్య' చూడొచ్చు.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment