సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ మంచి ఫ్యామిలీ మూవీ. చిన్న క్రైమ్ డ్రామా కూడా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు, మీనూ, బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మణిశర్మ, రమణ గోగులగార్లకు నేను అభిమానిని. ‘గోదారి గట్టు’ పాటను రమణ గోగులగారితో పాడించడం సంతోషాన్నిచ్చింది.
అలాగే కొంత గ్యాప్ తర్వాత మధు ప్రియగారు ఈ పాట పాడారు. అనంత శ్రీరామ్ ‘మీనూ..’ పాటకు మంచి లిరిక్స్ ఇచ్చారు. ‘మీనూ..’ పాటను అనిల్‌గారు నన్నే పాడమన్నారు. నాతో పాటు ఈ పాటను ప్రణవి ఆచార్య పాడారు. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటకు రామజోగయ్య శాస్త్రిగారు సాహిత్యం అందించారు. ఈ పాటను అర్ధరాత్రి వెంకటేశ్‌గారు విని, మార్నింగ్ వచ్చి తానే పాడతానని అన్నారు. ఆయనే పాడారు. నేను, రోహిణి గొంతు కలిపాము. పాట పాడిన తర్వాత నేను పాడిన పాట నచ్చకపోతే తీసేయమని వెంకటేశ్‌గారు అన్నారు.
వాస్తవానికి ఆయన స్థాయి, ఇమేజ్‌కు ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఇక మా సినిమాలోని పాటలకు మంచి స్పందన లభిస్తోందంటే కారణం... సాహిత్యం పట్ల అనిల్‌గారికి ఉన్న అభిరుచి. ‘దిల్’ రాజుగారి డీపీఆర్ బేనర్‌లో ‘బలగం’ మూవీ చేశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేసే చాన్స్ కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఇలా అన్ని విధాలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నా జీవితంలో జరిగిన ఓ అద్భుతం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment