‘‘పోటీ అనేది సినిమాల్లోనే కాదు.. ప్రతి చోటా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి కంటెంట్ వస్తుంది. ఆరోగ్యకరమైన సోటీ మంచిదే. అన్ని సినిమాలూ గొప్పగా ఆడాలి.. అందరూ బాగుండాలి’’ అని సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ అన్నారు. బాలకష్ణ, శ్రుతీహాన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా రేపు (గురువారం) రిలీజవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన చిత్ర విశేషాలు.
⇔ బాలకృష్ణగారితో నేను చేసిన ‘అఖండ’ సినిమాతో ‘వీరసింహారెడ్డి’కి పోలికే లేదు. ఇది కల్ట్ మూవీ. ఎమోషనల్, సిస్టర్ సెంటిమెంట్, బాలకృష్ణగారి మాస్.. ఇలా అన్ని అంశాలతో అదిరిపోతుంది.
⇔ దర్శకుడు మంచి సినిమా తీస్తేనే నేను మంచి మ్యూజిక్ ఇవ్వగలను. ఒక సినిమాకి పునాది దర్శకుడే. బాలకృష్ణగారి అభిమానిగా గోపీచంద్ చాలా గొప్పగా తీశారు.. దాని వల్లే నాకూ మంచి మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చే అవకాశం వచ్చింది. సినిమా ఏం కోరుకుంటుందో అది ఇవ్వడమే మన పని. ఇందులో ‘జై బాలయ్య, సుగుణ సుందరి, మాస్ మొగుడు..’ వంటి పాటలన్నీ చక్కగా కుదిరాయి. మాస్ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్ పుడుతుంది.
⇔ ‘అఖండ’లో మ్యూజిక్‌కి స్పీకర్లు పగిలిపోయాయి. ‘వీరసింహారెడ్డి’లోనూ స్పీకర్లు పగులుతాయి జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణగారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలనిపిస్తుంది (నవ్వుతూ). చాలా రోజుల తర్వాత సెకండ్ హాఫ్‌లో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో అదరగొట్టే సినిమా ఇది. పాప్ కార్న్ తినే టైమ్ కూడా ఉండదు.. సినిమాని చూస్తూనే ఉంటారు.
⇔ ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకష్ణగారి ‘వీరసింహారెడ్డి’ రెండూ గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment