టైటిల్: మై నేమ్ ఈజ్ శృతి
నటీనటులు:హన్సిక, ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు
నిర్మాత:బురుగు రమ్య ప్రభాకర్
దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
విడుదల తేది: నవంబర్ 17, 2023
కథేంటంటే..
శృతి(హన్సిక) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అమ్మ పెంపకంలో పెరిగి పెద్దదవుతుంది. సోషల్ మీడియా ద్వారా చరణ్(సాయి తేజ)తో ప్రేమలో పడుతుంది. అతన్ని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన శృతి..అనుకోకుండా స్కిన్ మాఫీయా ముఠా వలలో చిక్కుకుంటుంది. ఆ ముఠా లీడర్, ఎమ్మెల్యే గురుమూర్తి(నరేన్) చేసే అరచకాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? శృతిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసు అధికారి రంజిత్(మురళీ శర్మ) ఈ కేసును ఎలా విచారించాడు? స్కిన్ మాఫీయా వెనుక ఉన్నదెవరు? ఎమ్మెల్యే గురుమూర్తికి, స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి(ప్రేమ)కు ఉన్న సంబంధం ఏంటి? స్కిన్ మాఫియా ముఠాను అరికట్టేందుకు శృతి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
మెడికల్ మాఫియా నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కొంతమంది డబ్బు కోసం గుండె, కిడ్నీ లాంటి అవయవాలతో ఎలాంటి వ్యాపారం చేస్తారో చాలా సినిమాల్లో చూశాం. అందం కోసం పిండాలను అమ్మేసే మాఫియా ఉందని ‘యశోద’ చిత్రం ద్వారా తెలుసుకున్నాం. కానీ స్కిన్ డ్రాప్టింగ్ మాఫియా నేపథ్యంలో మాత్రం ఇంతవరకు ఏ సినిమా రాలేదు. ఆ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే `మై నేమ్ ఈజ్ శృతి`. చర్మంతో కూడా వ్యాపారం చేస్తున్నారనే కొత్త అంశాన్ని ప్రేక్షకులను తెలియజేశాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్.
డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికే.. తెరపై అంతే కొత్తగా చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్కిన్ డ్రాప్టింగ్ అంశంతోనే కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. మర్డర్‌ని రివీల్ చేసి చేసి.. అందులోని ట్విస్ట్‌ను సస్పెన్స్‌లో పెట్టాడు. ముందు, వెనుక అంటూ ఫస్టాఫ్ అంతా సస్పెన్స్‌గానే సాగుతుంది. అయితే ప్రతిసారి కథ ముందుకు, వెనక్కు వెళ్లడంతో ప్రేక్షకుడు పూర్తిగా కథలో లీనం కాలేడు. కానీ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని మాత్రం కొనసాగిస్తూ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించేలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది.
ఫస్టాఫ్‌లోని పలు ప్రశ్నలకు సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది. స్కిన్ మాఫియాకి, శృతికి ఉన్న సంబంధం, స్కామ్‌ని బయట పెట్టేందుకు శృతి వేసే ప్లాన్.. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు థ్రిలింగ్‌గా ఉంటాయి. అయితే కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా.. సినిమాటిక్‌గా అనిపిస్తాయి. స్కిన్ మాఫియా గురించి మరింత లోతుగా చర్చించి, స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా తీసుకెళ్తే బాగుండేది.
ఎవరెలా చేశారంటే..
శృతి పాత్రకి హన్సిక న్యాయం చేసింది. అమాయకంగా కనిపిస్తూనే..ముఖంతోనే అనేక భావోద్వేగాలను పలికించి ఆకట్టుకుంది. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్లలో కూడా ఆకట్టుకుంది. విలన్‌గా పూజా రామచంద్రన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. డబ్బుకోసం ఎంతకైనా తెగించే యువతి పాత్ర తనది. ఇక అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి పాత్రలో నటించి, మెప్పించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. నరేన్, మురళీ శర్మ, ప్రవీణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment