Na Venta Paduthunna Chinnadevadamma Movie Review In Telugu - Sakshi
Sakshi News home page

‘నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ మూవీ రివ్యూ

Published Fri, Oct 14 2022 6:02 PM | Last Updated on Fri, Oct 14 2022 7:30 PM

Na Venta Paduthunna Chinnadevadamma Movie Review In Telugu - Sakshi

టైటిల్‌: నా వెంట పడుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా
నటీనటులు: తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌రులు
నిర్మాతలు: ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు
దర్శకత్వం: వెంక‌ట్ వందెల‌
సంగీతం: సందీప్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ : పి.వంశిప్రకాశ్‌
ఎడిటర్‌: నందమూరి హరి
విడుదల తేది: అక్టోబర్‌ 14, 2022

కథేంటంటే..
పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెం ప్రెసిడెంట్‌ కొడుకు రాధ(తేజ్‌ కూరపాటి)కి, జువ్వాలపాలెం ప్రెసిడెంట్‌ కూతురు కృష్ణ(అఖిల ఆకర్షణ) మధ్య ఎలాంటి పరిచయం ఉండదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని పుకార్లు పుట్టిస్తారు జోగీబ్రదర్స్‌. ఆ రెండు ఊర్లకు వైరం పెట్టించడం కోసమే జోగీ బ్రద​ర్స్‌ ఈ పుకారును సృష్టిస్తారు. ప్రజలు కూడా నిజంగానే రాధ,కృష్ణ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని నమ్ముతారు.

ఈ విషయం రాధ వరకు చేరడంతో..అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. కృష్ణని చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు రాధ. ఆమెకు తెలికుండా రోజూ ఫాలో అవుతుంటాడు. ఒక అబ్బాయి తన వెంట పడుతున్నాడనే విషయం కృష్ణకు తప్ప ఊర్లో వాళ్లందరికి తెలుస్తుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఇద్దరు పారిపోయి తిరుపతి వెళ్తారు. అనుకోకుండా ఒకే బస్‌లో తిరుపతికి వెళ్లిన వీరిద్దరికి కాలేజీ చైర్మన్‌ అరుణ్ గోకలే (త‌ణికెళ్ళ భ‌ర‌ణి) వీరికి సెల్టర్ ఇచ్చి కాలేజ్ జాయిన్ చేసుకుంటాడు. అక్కడ రూమ్స్‌ లేని కారణంగా ఇద్దరికి ఒకే గది ఇస్తాడు.

అయితే కృష్ణ మాత్రం రాధతో ఉండేందుకు నిరాకరిస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్‌ వచ్చి రాధ గురించి తనకు బాగా తెలుసని, అతను గే అని, టెన్షన్‌ పడాల్సిందేమి లేదని చెబుతాడు. దీంతో అతనితో కలిసి ఒకే గదిలో ఉంటుంది కృష్ణ. దాని వల్ల కృష్ణ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ప్రిన్సిపల్‌ చెప్పినట్లు రాధ నిజంగానే ‘గే’నా? పారిపోయిన పిల్లల కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు వీరిద్దరు హత్య చేయబడ్డారనే వార్త తెలుస్తుంది. అందులో నిజమెంత? అసలు వీరిద్దరినీ మర్డర్ చేసే బలమైన కారణం ఏంటి? చివరకు రాధ, కృష్ణలు ఒక్కటయ్యారా?లేదా? అనేదే మిగతా కథ.



ఎవరెలా చూశారంటే..
హుషారు, షికారు, రౌడీ బాయ్స్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో తేజ్‌ కూరపాటి. సోలో హీరోగానూ రాణిస్తున్నాడు. రాధ పాత్రకి న్యాయం చేశాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ని తెరపై  చక్కగా వ్యక్త పరిచాడు. హీరోయిన్ గా నటించిన అఖిల ఆక‌ర్ష‌ణ కు మొదటి చిత్రమైనా ఆకట్టుకుంది.ఇందులో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ మన పక్కింటి అమ్మాయి, అబ్బాయి లాగా చాలా చక్కగా నటించారు. కాలేజీ చైర్మన్‌ అరుణ్ గోకలే గా తణికెళ్ల భరణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. పోలీసు అధికారిగా  జీవా, రాధ తల్లి తండ్రులుగా డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ లు, కృష్ణ తల్లితండ్రులుగా బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, మాధవి ప్రసాద్ లు, చాలా బాగా నటించారు. జోగీ బ్రదర్స్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..
ప‌ల్లెటూరి నేప‌ధ్యంలో సాగే చక్కటి ప్రేమ కథే ‘నా వెంటపడుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’. ఓ మంచి లవ్‌స్టోరీకి కామెడీ మిక్స్‌ చేసి యూత్‌ని ఆకట్టుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు వెంకట్‌ వందెల. పాత కథే అయితే కథన​ం మాత్రం ఫ్రెష్‌గా ఉంది. హీరోయిన్‌కి తెలియకుండా హీరో ఫాలో అవడం.. ఆ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు తిట్టడం. ఇద్దరి కలిసి ఒకే బస్‌లో తిరుపతి వెళ్లడం ఇలా ఫస్టాఫ్‌ సింపుల్‌గా సాగుతుంది. ఒక సెకండాఫ్‌లో మాత్రం కామెడీ  వర్కౌట్‌ అయింది.

హీరో గే అని చెప్పిన తర్వాత వచ్చే సీన్స్‌ నవ్వులు పూయిస్తుంది. తణికెళ్ల భరణి పాత్ర సినిమాకు చాలా ప్లస్‌ అయింది. క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఓ స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమను చూపించాడు దర్శకుడు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సందీప్‌ కుమార్‌ సంగీతం బాగుంది. ‘పుడిమిని త‌డిపే తొల‌క‌రి మెరుపుల‌ చినుక‌మ్మా’పాట అందరిని ఆకట్టుకుంటుంది. వంశీ ప్రకాశ్‌ సినిమాటోగ్రఫీ,నందమూరి హరి ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement