దివంగత నటుడు నాగేశ్‌ను ఇండియన్ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. ఈ తమిళ నటుడు తెలుగులో శ్రీ రామ బంటు, ఒక చల్లని రాత్రి, తూర్పు పడమర, సోగ్గాడు, పాపం పసివాడు, కొండవీటి సింహం, శ్రీరంగనీతులు, ప్రచండ భైరవి, భలే తమ్ముడు, శత్రువు, నేటి సావిత్రి.. ఇలా ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి మనవడు, నటుడు ఆనంద్‌బాబు కుమారుడు బిజేశ్ నాగేశ్ రంగంలోకి దిగారు. ఈయన ఇంతకు ముందు సంతానం కథానాయకుడిగా నటించిన సర్వర్ సుందరం, ప్రభుదేవా హీరోగా నటించిన పొన్ మాణిక్యవేల్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
వానరన్ మూవీతో హీరోగా
ఇప్పుడు వానరన్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆరెంజ్ పిక్చర్స్ పతాకంపై రాజేశ్ పద్మనాభన్, సుజాత రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను శ్రీరామ్ పద్మనాభన్ నిర్వహిస్తున్నారు. అక్షయ హీరోయిన్‌గా నటిస్తుండగా లొల్లుసభ జీవా, దీపా శంకర్, ఆదేశ్ బాలా, నాంజిల్ విజయన్, ఎస్‌ఎల్ .బాలాజీ, బేబీ వర్ష, వెంకట్‌రాజ్, శివగురు, రామ్‌రాజ్, వెడికన్నన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. తండ్రీకొడుకుల అనుబంధం ఇతి వృత్తంతో రూపొందిస్తున్న వానరన్‌లో బిజేశ్ నాగేశ్ చాలా సహజంగా నటించారన్నారు. అక్షయ.. ఒయిలాట్టం కళాకారిణిగా అద్భుతంగా చేశారన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో 30 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న తరుణంలో వానరన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment