టైటిల్: ‘నారాయణ & కో’
నటీనటులు: సుధాకర్ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్, ఆమని, పూజ కిరణ్, సప్తగిరి తదితరులు
నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కోమకుల
దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి
సంగీతం: సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్
విడుదల తేది: జూన్ 30, 2023
కథేంటంటే..
నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్‌లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్ బెదిరిస్తాడు.
దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్(తోటపల్లి మధు) తరపున ఓ డీల్ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్ ఒప్పుకుంటారు. మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్(అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
అనుకోకుండా వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం అంతా కలిసి చేసే తింగరి పనులే ‘నారాయణ అండ్ కో మూవీ కథ. అందుకే ఈ చిత్రానికి ‘ది తిక్కల్ ఫ్యామిలీ ’ట్యాగ్ లైన్ పెట్టారు. దానికి తగ్గట్టే కథనం సాగుతుంది. కానీ ప్రతి సన్నివేశం గత సినిమాలను గుర్తుకు తెస్తుంది. కథ-కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోగా చాలా వరకు సీన్స్ బోర్ గా కొనసాగుతాయి.
నారాయణ ఫ్యామిలీ పాత్రల పరిచయాలతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోహీరోయిన్లు పబ్‌లో కలసుకోవడం.. ప్రెగ్నెంట్ అయ్యానంటూ పెళ్లి చేసుకోవడం.. చకచకా జరిగిపోతుంది. అయితే హీరోపై హీరోయిన్‌కి లవ్ పుట్టే రీజన్ కన్విసింగ్‌గా అనిపించలేదు. కొన్ని కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కథ-కథనమే బోరింగ్ అనుకుంటే.. సంబంధం లేకుండా వచ్చే పాటలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. ఓవరాల్‌గా ‘నారాయణ అండ్ కో’ ప్రేక్షకులను నవ్వించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయింది.
ఎవరెలా చేశారంటే..
ఆనంద్ పాత్రకు సుధాకర్ న్యాయం చేశాడు. ఈ సినిమాలో డ్యాన్స్ కూడా అదరగొట్టాడు. హీరో తమ్ముడు సుభాష్‌గా జైకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్తదనం ఎంటంటే.. దేవీ ప్రసాద్, ఆమని పూర్తిగా కామెడీ రోల్ ప్లే చేయడం. నారాయణగా దేవీ ప్రసాద్, జానకిగా ఆమని చేసే కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తాయి. సినిమాలో వీరిద్దరికే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఎస్సై అర్జున్‌గా అలీ రెజా, ప్రీతిగా ఆర్తిలు ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే వీరి పాత్రల నిడివి చాలా తక్కువ. సప్తగిరి కామెడీ వర్కౌట్ కాలేదు. పూజ కిరణ్, తోటపల్లి మధుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాకొస్తే సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సంగీతం పర్వాలేదు. ‘దండక డన్ డన్’ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేవు. బీజీఎం ఓకే. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment