ధనుష్ తండ్రి, దర్శక–నిర్మాత కస్తూరి రాజా
నయనతార సినీ, వ్యక్తిగత జీవితంపై రూపొందించిన నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (నేనూ రౌడీనే)లోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు.
తాజాగా ధనుష్ తండ్రి, దర్శక–నిర్మాత కస్తూరి రాజాను ‘ఈ విషయమై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా – ‘‘నయనతార వ్యవహారం గురించి నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. మేం ఎప్పుడూ ముందుకు పరిగెడుతుంటాం. తరుముకు వచ్చే వారి గురించి కానీ, వెనక మాట్లాడే వారి గురించి కానీ పట్టించుకునేంత టైమ్ మాకు లేదు. అయితే ధనుష్ అనుమతి కోసం రెండేళ్లు ఎదురు చూశానని నయనతార చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. మా దృష్టంతా మేం చేసే పని మీద ఉంటుంది. ధనుష్ ‘ఇడ్లీ కడై’ చిత్రంతో బిజీగా ఉన్నారు’’ అన్నారు.
– చెన్నై, ‘సాక్షి’ సినిమా ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment