
వందాచ్చే.. వందాచ్చే... ఈ పదాలు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘సూపర్ మచ్చి’ పాటలో విన్నాం. అంటే... వచ్చాడే/వచ్చిందే.. ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు తమిళ సినిమా కాదలర్‌గళుక్కు (సినిమా ప్రేమికులకు) అసలు సిసలైన దీపావళి పండిగై (పండగ) వందాచ్చే.. పండగకి తమిళ తెర కొత్త సినిమాలను చూడబోతోంది. ఇప్పటికే కొన్ని పాత సినిమాలు మంగళవారం తెరకొచ్చాయి. అయితే ఈ సినిమాల విడుదల వెనక కొన్ని రోజులుగా తమిళ పరిశ్రమలో ఓ వివాదం సాగింది. ఆ విషయం, కొత్తగా వచ్చిన చిత్రాలు, ఆడుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం
వాంగ (రండి).
కరోనా ఎంత పని చేసింది? సినిమా పరిశ్రమను భారీ నష్టాలవైపు నెట్టింది. ఆగిపోయిన షూటింగులతో వడ్డీలు పెరిగి, నష్టాల్లో నిర్మాత ఉంటే.. తెర మీద బొమ్మ పడక థియేటర్ యాజమాన్యం నష్టపోయింది. విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా ఆగాయి. ఈ నేపథ్యంలో 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు తెరవచ్చని ప్రభుత్వం అనుమతించడం ఓ ఊరట. పైగా దీపావళి పండగ సెలవులు ఎలానూ ఉంటాయి కాబట్టి ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ‘కొత్త సినిమాలను విడుదల చేయకూడదు’ అంటూ కొన్ని రోజుల క్రితం ‘తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (టీఎఫ్‌ఎపీఎ) ప్రకటించింది. ఎందుకూ అంటే.. ‘వర్చువల్ ప్రింట్ ఫీ’ (వీపీఎఫ్)ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్ సినిమాస్, యూఎఫ్‌ఓ ‘వీపీఎఫ్’లో 60 శాతం తగ్గిస్తామని, థియేటర్ యాజమాన్యానికి నిర్మాతలు 40 శాతం చెల్లిస్తే చాలని పేర్కొన్నాయి. కానీ వంద శాతం తగ్గించాలన్నది టీఎఫ్‌ఎపీఎ డిమాండ్. తగ్గించకపోతే కొత్త సినిమాలను విడుదల కానివ్వమని కూడా పేర్కొన్నారు. కొన్ని రోజులుగా జరిగిన ఈ చర్చకు మంగళవారం ఫుల్ స్టాప్ పడింది. క్యూబ్, యూఎఫ్‌ఓ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని మార్చుకుని మరో రెండు వారాలకు వర్చువల్ ప్రింట్ ఫీ వసూలు చేయమని పేర్కొనడంతో కొత్త సినిమాల విడుదలకు టీఎఫ్‌ఎపీఎ అనుమతిచ్చింది.
నవంబర్ 30 వరకు వర్చువల్ ప్రింట్ ఫీ వసూలు చేయమని క్యూబ్, యూఎఫ్‌ఓ ప్రతినిధులు ప్రకటించడంతో తమిళ సినిమా నిర్మాతలు కొత్త ఉత్సాహంతో 9 నూతన చిత్రాలను విడుదల చేయటానికి ముందుకు వచ్చారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, హీరోగా చేస్తున్న సంతానం నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘బిస్కోత్’, సంతోష్ పి జయకుమార్ నటించి, దర్శకత్వం వహించిన హారర్ మూవీ ‘ఇరండామ్ కూత్తు’, జీవా అరుళ్ నిధి హీరోలుగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కళత్తిల్ సందిప్పోమ్’, టీజే అరుణాచలం, ఫౌజీ నటించిన యాక్షన్ డ్రామా ‘తాట్రోమ్ తూక్రోమ్’ వంటి కొత్త సినిమాలు పండగకు విడుదలవుతున్నాయి.
థియేటర్లో ఉన్న సినిమాలు
మంగళవారం తమిళనాడులో థియేటర్లు తెరచుకున్నాయి. అయితే వీపీఎఫ్ విషయంలో మంగళవారం సాయంత్రం వరకూ ఒక క్లారిటీ లేకపోవడంతో లాక్ డౌన్‌కి ముందు విడుదలైన సినిమాలను ప్రదర్శించాలనుకున్నారు. విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’, దుల్కర్ సల్మాన్ ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లై అడిత్తాల్’, హిందీ చిత్రం ‘విక్కీ డోనర్’కి రీమేక్ గా రూపొంది, ఈ ఏడాది మార్చిలో థియేటర్లు మూతబడక ముందు విడుదలైన ‘దారాళ ప్రభు’ వంటి తమిళ చిత్రాలతో పాటు తెలుగు హిట్స్ ‘అల వైకుంఠపురములో’, ‘భీష్మ’, ‘హిట్’ కూడా తమిళ తెరపై ప్రదర్శితమవుతున్నాయి. అలాగే హిందీ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘అంధాధూన్’ని కూడా ప్రదర్శిస్తున్నారు.
ఈ చిత్రాలన్నీ ఈ నెల 14 వరకూ థియేటర్లలో ఆడతాయని తెలిసింది. ఆ తర్వాత కొత్త సినిమాలను ప్రదర్శించేలా ప్లాన్ చేశారని కోలీవుడ్ టాక్. నిజానికి కేంద్ర ప్రభుత్వం థియేటన్ల రీ ఓపెన్‌కి అనుమతి ఇచ్చినా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ‘ఇప్పట్లో వద్దు’ అని పేర్కొంది. అందుకే ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా)ని ఓటీటీలో విడుదల చేయాలని హీరో, నిర్మాత సూర్య నిర్ణయించుకుని ఉండి ఉండొచ్చు. థియేటర్ల ఆరంభం, వీపీఎఫ్ విషయంలో ఓ స్పష్టత ఉండి ఉంటే.. పండగకి సూర్య లాంటి స్టార్ కూడా తెరపై కనిపించి ఉండేవారు.
దీపావళికి ఏ సినిమానీ విడుదల చేయకూడదని ముందుగా నిర్ణయం తీసుకున్నాం. సినిమావారికి పండగ సీజన్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొని క్యూబ్, యూఎఫ్‌ఓ వంటి సంస్థలు ఈ నెల 30 వరకు వీపీఎఫ్ తీసుకోమని చెప్పడంతో కొత్త సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. నిర్మాతలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుని, ఒక్కరోజులో మీటింగ్ పెట్టుకుని ఇప్పటికే రెడీగా ఉన్న తొమ్మిది కొత్త సినిమాలను పండగకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది తమిళ సినిమా పరిశ్రమకు ఎంతో శుభ పరిణామం.
– ధనుంజయ్, టీఎఫ్‌ఏపీఏ ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment