‘‘నేను తెలుగు బాగా మాట్లాడగలను. కేవలం ‘అందరికీ నమస్కారం’ అనే బ్యాచ్ కాదు’’ అన్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ‘రాజా సాబ్’, పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ సమయం కుదిరినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేని నిధీ అగర్వాల్ చాలా విరామం తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో నెటిజన్లతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కెరీర్, వ్యక్తిగత విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. మీకు తెలుగు మాట్లాడటం వస్తుందా మేడం? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు తెలుగు మాట్లాడటం బాగా వస్తుంది. కేవలం ‘అందరికీ నమస్కారం’ అంటూ జస్ట్ అలా మాట్లాడే బ్యాచ్ కాదు’’ అంటూ సూటిగా జవాబిచ్చారు.
‘తెలుగులో ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అనే మరో ప్రశ్నకు.. ‘‘నేను మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. మీకు బోర్ కొట్టకుండా మీ అభిమానం పొందే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నా. అయితే 2025లో తెలుగులో నేను నటించిన ఎక్కువ సినిమాలు విడుదలవుతాయి’’ అని చెప్పారు. ‘జీవితంలో ఏది చాలా ముఖ్యం అనుకుంటారు?’ అనే మరో ప్రశ్నకు ‘‘ప్రశాంతత’’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఓ నటిగా మీకు చాలా కష్టంగా అనిపించేది ఏంటి?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘‘పీఆర్ మెయింటేన్ చేయడం నాకు చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు.
‘మీకు హారర్ సినిమాలంటే ఇష్టమేనా? ఒంటరిగా కూర్చొని చూస్తారా?’ అనే ప్రశ్నకు ‘‘అస్సలు చూడలేను. నాతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే. ‘రాజా సాబ్’ (హారర్ నేపథ్యంలో రూపొందుతోంది) సినిమా చూడ్డానికి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో థియేటర్స్‌కి రండి’’ అని బదులిచ్చారు. అలాగే మరికొందరు నెటిజన్ల ప్రశ్నలకు నిధీ అగర్వాల్ స్పందిస్తూ– ‘‘ప్రభాస్‌గారితో కలిసి నటించిన ‘రాజా సాబ్’ సినిమా సెట్‌లో ఎంతో సరదాగా పని చేశాం. ఈ మూవీ టీమ్‌లో ఎంతో నిజాయతీ ఉంది.
‘హరి హర వీరమల్లు’ సెట్‌లో పవన్ కల్యాణ్‌గారితో ఇటీవల ఓ సెల్ఫీ తీసుకున్నాను... త్వరలోనే ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. రాబోయే నూతన సంవత్సరంలో నేను నటించిన ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతాయి.. ఆ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువవుతాను. ఆ రెండు చిత్రాలతో పాటు మరో సర్‌ప్రైజింగ్ మూవీ కూడా ఉంది.. త్వరలోనే ఆ మూవీ ప్రకటన కూడా వస్తుంది’’ అంటూ తెలిపారు నిధీ అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment