నిహారిక లిరా దత్... ‘పాతాల్ లోక్’తో ఆకాశానికి ఎగసిన నటి. ఓటీటీ ఖాతా ఉన్న ప్రతి వీక్షకుడు ‘సారా మాథ్యూస్’గా ఆమెకు అభిమాన ఇల్లు కట్టాడు.
- పుట్టి పెరిగింది ఢిల్లీలో. తండ్రి.. అభిజిత్ దత్. యాక్టర్, రైటర్, ఫిల్మ్‌మేకర్. తల్లి.. పియూ దత్. రిటైర్డ్ టీచర్, థియేటర్ ప్రొఫెషనల్. నిహారికకు ఒక అక్క.. అవలోకిత దత్..కూడా ఫిల్మ్‌మేకర్. ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది నిహారికది నటనావారసత్వం అని!
- లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్‌లో డిగ్రీ పూర్తి చేసిన నిహారిక నటన తప్ప ఇంకే రంగం గురించి ఆలోచించలేదు. అందుకే ముంబై వెళ్లి ‘డ్రామా స్కూల్ ఆఫ్ ముంబై’లో చేరింది. నటనలో మెలకువలు నేర్చుకుంది. థియేటర్‌లో తన ప్రతిభను పరీక్షించుకుంది.
- ‘ది బిజేర్ మర్డర్ ఆఫ్ మిస్టర్ టస్కర్’లో లీడ్ రోల్ దక్కింది. పుష్పవల్లి, ఫైనల్ సొల్యుషన్’లలోనూ అలరించింది.
- అవన్నీ ఒకెత్తు.. ‘పాతాల్ లోక్’ ఒకెత్తు. అందులో జర్నలిస్ట్ సారా మాథ్యూస్‌గా నటించిన నిహారికను ప్రత్యేకంగా గుర్తించడం మొదలుపెట్టింది ఓటీటీ ప్రపంచం.
- నటనతోపాటు గానమూ ఆమెకు ప్రాణమే. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. పుస్తకాలు, ప్రయాణాలు ఆమెను సేదతీర్చే ఇతర వ్యాపకాలు.
- ఆ ప్రతిభకు అందిన ప్రశంసలే ఆమెకు అమెజాన్‌లో ‘డై ట్రైయింగ్’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చాయి. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ‘మ్యూజిక్ టీచర్’ అనే వెబ్ మూవీలోనూ ప్రధాన భూమిక పోషించింది.
- ‘‘అమ్మా, నాన్నా ఏ లోటు రాకుండా చూసుకున్నారు. నా మనసు యాక్టింగ్ మీదనే ఉందని తెలిసి థియేటర్‌ను పరిచయం చేశారు. నా లక్ష్యానికి దారి చూపించారు. నా బెస్ట్ క్రిటిక్స్ మా పేరెంట్సే. వాళ్ల కాంప్లిమెంట్సే నాకు అవార్డ్స్. నన్ను చూసి గర్వపడ్తుంటారు వాళ్లు. ఇంతకన్నా నాకేం కావాలి? మంచి నటిని అనిపించుకోవాలన్న ఆశ తప్ప జీవితం మీద కంప్లయింట్స్ లేవు’ అంటుంది నిహారిక లిరా దత్.
Comments
Please login to add a commentAdd a comment