‘‘తెలుగు సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్రలే చేస్తున్నారెందుకు? అని అడుగుతున్నారు.. నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తా.. ప్రాధాన్యం ఉంటే చాలు.. అది మొదటి హీరోయినా? రెండో హీరోయినా? అనేది చూడను’’ అన్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ చెప్పిన విశేషాలు.
► వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చేశాను. కిశోర్‌గారి దర్శకత్వంలో ‘చిత్రలహరి’ ఇప్పుడు ‘రెడ్’ సినిమా చేశా. వీరిద్దరి ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. వీళ్ల సినిమాలంటే కథ ఏంటి? నా పాత్ర ఏంటి? అని అడగకుండా ఒప్పుకుంటా.
► ‘రెడ్’ సినిమాలో నాది ఇన్నోసెంట్ పోలీస్ పాత్ర. కానీ బయటకు రఫ్‌గా ఉంటాను. పోలీస్ పాత్ర కోసం ప్రత్యేకించి హోమ్‌వర్క్ చేయలేదు. ఎందుకంటే తమిళంలో ఓ సినిమాలో పోలీస్ పాత్రలో నటించాను. ఆ అనుభవం ఈ పాత్రకి బాగా ఉపయోగపడింది.
► ‘చిత్రలహరి’లో నాది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేసినందుకు ఎలాంటి బాధ లేదు. ఆ సినిమా చాలామందికి రీచ్ అయింది. ‘రెడ్’ సినిమాలో నాది పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. ఇందులో రామ్ చేసిన రెండు పాత్రలతో నాకు సీన్లు ఉన్నాయి కానీ హీరోయిన్లతో లేవు.
► నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. అయితే తెలుగులో అన్నీ సీరియస్ పాత్రలే వస్తున్నాయి. అది కూడా హోమ్లీగా ఉండేవే. గ్లామరస్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ఏ ఇండస్ట్రీలో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్లు ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే ఉన్నన్ని రోజులూ అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి అన్ని పాత్రలూ చేస్తున్నారు. నాకూ ఆయనలా చేయాలనుంది. నాకు లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది.
► కెరీర్ ప్రారంభంలో తమిళ్‌లో వరుసగా ఎనిమిది సినిమాలు ఒప్పుకున్నాను. అవి ఎందుకు ఒప్పుకున్నానా? అని ఆ తర్వాత అనిపించింది. ఇప్పుడు ఏ పాత్ర నాకు సరిపోతుందో దాన్నే ఎంచుకుంటున్నాను. ∙‘విరాటపర్వం’లో నాది అతిథి పాత్ర. విశ్వక్ సేన్ ‘పాగల్’లో నా పాత్ర సరదాగా ఉంటుంది. మరో తెలుగు సినిమా సైన్ చేశాను.
లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది
Published Tue, Jan 5 2021 12:37 AM | Last Updated on Tue, Jan 5 2021 9:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment