No Entry For Ramya Raghupathi In Naresh Home: Court - Sakshi
Sakshi News home page

VK Naresh: రమ్య రఘుపతికి డబుల్‌ షాకిచ్చిన కోర్టు.. ఆమె వల్లే ఇబ్బంది అంటూ..

Published Wed, Aug 2 2023 2:01 PM | Last Updated on Wed, Aug 2 2023 3:28 PM

No Entry for Ramya Raghupathi in Naresh Home - Sakshi

మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతికి షాక్‌ తగిలింది. మెరిట్‌ లేని కారణంగా బుధవారం నాడు కేసు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ రమ్య రఘుపతి బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేసింది.

సినిమాను అడ్డుకునే ప్రస​క్తే లేదు
సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని న్యాయస్థానం నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ తీర్పు ప్రకారం సినిమాను ఎక్కడైనా నిర్మాతలు స్వేచ్ఛగా ప్రసారం చేయవచ్చు.

నరేశ్‌ ఇంట్లో ప్రవేశానికి రమ్యపై నిషేధం
మరో కేసులో నరేష్ కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిని నరేష్ నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం రమ్య రఘుపతి అక్కడి ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని గుర్తించింది. ఆమె కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురవుతున్నారని కూడా పేర్కొంది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు రమ్య రఘుపతిని నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

6 సంవత్సరాలుగా విడివిడిగా జీవనం
ఇకపోతే నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్యాభర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దవుతుంది. కోర్టు ఇచ్చిన తీర్పు.. నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. కాగా రమ్య రఘుపతి.. నరేష్‌పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు .. రమ్య రఘుపతిపై గృహ నిషేధం కేసు పెట్టారు. రమ్య రఘుపతిపై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్‌కు సంబంధించి సైబర్ క్రైమ్ కేసు పెండింగ్‌లో ఉంది.

చదవండి: రామ్‌చరణ్‌ కూతురికి స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన బన్నీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement