ముంబై : మహారాష్ట్రలో అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతూ, సినిమా షూటింగులు ఆగిపోతున్న నేపథ్యంలో అక్కడి సినీ కార్మికుల సమాఖ్య సరికొత్త షూటింగ్ మార్గదర్శకాలను జారీ చేసింది. అవి కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు ఓ పర్యవేక్షక బృందాన్ని కూడా ఏర్పాటుచేసింది. షూటింగ్‌లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, గుంపులతో కూడిన దృశ్యాల చిత్రీకరణ ఆపేయడం లాంటి కోవిడ్–19 షూటింగ్ నియమావళిని కచ్చితంగా అమలయ్యేలా ఈ బృందం చూస్తుంది.
మహారాష్ట్రలో, మరీ ముఖ్యంగా ముంబయ్‌లో కరోనా కేసులతో సినీ, టీవీ రంగంపై పెను ప్రభావం పడడంతో పశ్చిమ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఎఫ్.డబ్లు్య.ఐ.సి.ఇ) ఈ నిర్ణయం తీసుకుంది. అక్షయ్ కుమార్,ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమి ఫెడ్నేకర్ సహా పలువురు ముఖ్యతారలు కరోనా బారిన పడడంతో ఇప్పటికే ‘రామ్ సేతు’, ‘గంగూబాయ్ కాఠియావాడీ’, ‘మిస్టర్ లేలే’ లాంటి పలు చిత్రాల షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎఫ్.డబ్లు్య.ఐ.సి.ఇ. కార్యనిర్వాహక సభ్యులు శుక్రవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. ప్రభుత్వం పేర్కొన్న జాగ్రత్తలను సినీ, టీవీ పరిశ్రమ బాధ్యతాయుతంగా అనుసరిస్తుందంటూ హామీ ఇచ్చారు. ఈ నెలాఖరు దాకా అమలులో ఉండే సరికొత్త షూటింగ్ మార్గదర్శకాల ప్రకారం ఇకపై జనసమూహంతో కూడిన సన్నివేశాలనూ, పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లున్న పాటలనూ చిత్రీకరించరాదు. అలాగే, ప్రీ–ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్–ప్రొడక్షన్‌లలో పాల్గొనేవారంతా జాగ్రత్తలు పాటించాలి.
సమాఖ్యకు చెందిన పర్యవేక్షక బృందం షూటింగ్ లొకేషన్లు, పోస్ట్–ప్రొడక్షన్ స్టూడియోలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ, మార్గదర్శకాలను పాటిస్తున్నదీ, లేనిదీ చూస్తుంది. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటారు. అలాగే, ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా మహారాష్ట్ర సర్కార్ వారాంతపు లాక్‌డౌన్ పెట్టినందు వల్ల ఇకపై అక్కడ షూటింగులన్నీ మిగతా రోజుల్లోనే చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment