‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు ప్రభాస్. ప్రస్తుతం చేస్తున్న‘రాధే శ్యామ్’తో పాటు తర్వాత చేయబోతున్న నాగ్ అశ్విన్ సినిమా కూడా బహు భాషా చిత్రమే. తాజాగా మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు ప్రభాస్. ఇది ఆయన కెరీర్ లో 22వ చిత్రం. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్’ అనే ఫ్యాంటసీ చిత్రంలో హీరోగా నటించనున్నారు ప్రభాస్. చెడు పై మంచి ఎలా విజయం సాధించింది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో శ్రీ రాముడి పాత్రలో కనిపిస్తారట ప్రభాస్. ఈ చిత్రం గురించి ప్రభాస్ మాట్లాడుతూ – ‘ప్రతీ పాత్రకు ఒక్కో ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నేను చేయబోయే పాత్రకు ఛాలెంజ్ తో పాటు చాలా బాధ్యత కూడా ఉంది. ఇలాంటి పాత్ర దొరకడం గర్వంగానూ ఉంది. ఓం ఈ సినిమాను అద్భుతంగా డిజైన్ చేశాడు’’ అన్నారు. బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ– ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమా 3డీలో కూడా విడుదలవుతుందట.
Comments
Please login to add a commentAdd a comment