టైటిల్: ఆపరేషన్ రావణ్
నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితరులు
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: వెంకట సత్య
సంగీతం: శరవణ వాసుదేవన్
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
విడుదల తేది: జులై 26, 2024
పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి. తాజాగా ఆయన నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. రక్షిత్ తండ్రి వెంకట సత్య ఈ మూవీలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఆపరేషన్ రావణ్’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్‌లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు.
తన కూతురు కూడా కనిపించడం లేదని తమ్ముడి వర్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సాధారణంగా సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథనం సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నేరం జరిగిన తీరు..వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్..దాన్ని హీరో ఎంత తెలివిగా ఛేదించాడన్న అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. బిగిసడలని స్క్రీన్‌ప్లే ఉండాలి. అప్పుడే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టగలుగుతాం. ఆపరేషన్ రావణ్ సినిమా విషయంలో ఆ ప్రయత్నం కొంతవరకు మాత్రమే సఫలం అయింది. సైకో థ్రిల్లర్ చేసే హత్యలు.. దాన్ని చూపించిన తీరు ఉత్కంఠబరితంగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్ మాత్రం సాదా సీదా అనిపిస్తుంది.
సైకో కిల్లర్‌ని కనిపెట్టేందుకు పోలీసులతో పాటు హీరోహీరోయిన్లు చేసే ఇన్వెస్టిగేషన్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే సైకో కిల్లర్ ఎవరని తెలిసిన తర్వాత షాక్‌కి గురవుతాం. అలాగే అతను అలా మారడానికి గల కారణం కూడా వాస్తవికంగా ఉంటుంది. సైకో ఎవరనేది చివరివరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్తగా కథనాన్ని నడిపాడు. తొలి సినిమానే అయినా..కొన్ని సీన్లను అనుభవం ఉన్న డైరెక్టర్‌లా తెరకెక్కించాడు.
సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ హత్య సీన్ పెట్టి కథపై ఆస్తకి కలిగించాడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్‌తో లవ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. కొన్ని అనవసరపు సన్నివేశాలను పెట్టి కథను సాగదీశాడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరై ఉంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మరింత పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఫేస్ రివీల్ చేసే సీన్, ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఆపరేషన్ రావణ్ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
గత సినిమాలతో పోలిస్తే రక్షిత్ అట్లూరి నటన మరింత మెరుగు పడింది. జర్నలిస్ట్ రామ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్‌ని ఛేజింగ్ చేసే సీన్ సినిమాకే హైలెట్. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆమనిగా సంగీర్తన విపిన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన వ్యక్తి కూడా క్లైమాక్స్‌లో తన నటనతో బయపెడతాడు.
రాధికా శరత్ కుమార్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా ఆకట్టుకుంది. చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. శరవణ వాసుదేవన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment