ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో నంబర్ వన్ అవార్డుగా ‘ఉత్తమ చిత్రం ’ విభాగాన్ని భావిస్తారు. అందుకే ఈ విభాగాపు అవార్డును వేడుకలో చివరిగా ప్రకటిస్తారు. అలాగే వేడుకలో చివరి మూమెంట్స్ కాబట్టి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. కానీ అలాంటి డ్రామా గడిచిన ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో కనిపించలేదు. ‘ఉత్తమ చిత్రం’ అవార్డును ప్రకటించిన ప్రముఖ నటుడు అల్ పచినో చాలా సాదాసీదాగా వెల్లడించేశారు.
పోటీలో ఉన్న పది చిత్రాల పేర్లు చెప్పకుండా.. అవార్డు సాధించిన చిత్రాన్ని ప్రకటించేశారు. కవర్‌ని మెల్లిగా తెరుస్తూ.. ‘నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనిపిస్తోందని సింపుల్‌గా ప్రకటించారు. ఇలా చేయడం పట్ల హాలీవుడ్‌లోని కొందరు నటీనటులు, ఇతర ప్రముఖులు విముఖత వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయంపై మంగళవారం అల్ పచినో స్పందించారు.
‘‘ఆస్కార్ వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా పాల్గొనడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇక వేడుకలో ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలవడానికి పోటీ పడ్డ పది చిత్రాల పేర్లను నేను చదవకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయని తెలిసింది. కానీ ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. అది ఆస్కార్ ప్రొడ్యూసర్ల నిర్ణయం. వేడుక ఆద్యంతం ఈ పది సినిమాల యూనిట్ వాళ్లు హైలైట్ అవుతూనే ఉన్నందువల్ల వారు ఇలా నిర్ణయించి ఉండొచ్చు.
ఆస్కార్‌కు నామినేట్ కావడం అనేది ఎవరి జీవితంలోనైనా ఓ మంచి మైల్‌స్టోన్. ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తిగా నాకు ఈ విషయం తెలుసు. వారి పేర్లు ప్రస్తావించకపోవడం అనేది బాధకు గురి చేసే విషయమే. ఈ ఘటన పట్ల బాధపడిన వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చెబుతూ ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు అల్ పచినో. ఇక ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఆపెన్‌హైమర్’, ‘అమెరికన్ ఫిక్షన్’, ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’, ‘బార్బీ’, ‘ది హోల్డోవర్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ‘మేస్ట్రో’, ‘΄ాస్ట్ లీవ్స్’, ‘పూర్ థింగ్స్’, ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాలు ΄ోటీ పడగా, ‘ఆపెన్‌హైమర్’ అవార్డు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment