'మీ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడేమో.. మా హీరో చాలా ఏళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ అయ్యాడురా'.. తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానుల మధ్య ఇలాంటి గొడవ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. పాన్ ఇండియా సినిమాల వల్ల టాలీవుడ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వందల కోట్ల కలెక్షన్స్ ని కళ్లప్పగించి చూస్తున్నారు. హీరోలని తోపు తురుము అని అంటూ ఫ్యాన్స్ భుజాలేగరేస్తున్నారు. కానీ 'పాన్ ఇండియా' అనే ట్యాగ్ వల్ల మన హీరోలు ఎన్ని కష్టాలు పడుతున‍్నారో తెలుసా?
'పాన్ ఇండియా' అంటే ఏంటి?
ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ఆయా రాష్ట్రాల కల్చర్ ప్రకారం సినిమాలు వస్తుంటాయి. కానీ దేశంలో ఉన్న అందరికీ నచ్చేలా తీసేవే పాన్ ఇండియా సినిమాలు. 20-30 ఏళ్ల క్రితం ఇలాంటి సినిమాలు వచ్చేవి కానీ అప్పట్లో 'పాన్ ఇండియా' అనే పేరు గట్రా ఏం లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఓ పదం ఉండాలి కాబట్టి 'పాన్ ఇండియా' అని పెట్టారేమో!
(ఇదీ చదవండి: ఒక్క నిమిషంలో 20 చీరలు.. ఆలియా అసలు ఎలా!?)
'బాహుబలి'తో షురూ
తెలుగు సినిమా చరిత్ర చాలా పెద్దది కానీ మన దగ్గర తప్పితే మన సినిమాలు బయట ప్రపంచానికి తెలిసినవి చాలా తక్కువ. ఎప్పుడైతే రాజమౌళి 'బాహుబలి' తీసి, వందల కోట్లు వసూళ్ల రుచి చూపించాడో టాలీవుడ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత పలువురు దర్శకులు ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' లాంటివి మాత్రం అదిరిపోయే రేంజు విజయాలు అందుకున్నాయి.
'పాన్ ఇండియా' వల్ల కష్టాలు
పాన్ ఇండియా సినిమాలు.. టాలీవుడ్ క్రేజుని ఎక్కడికో తీసుకెళ్తున్నాయని మనం సంబరపడిపోతున్నాం. కానీ మంచితో పాటు చెడు ఉన్నట్లు.. క్రేజ్ తోపాటు ఇవి కొత్త కష్టాల్ని తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ వచ్చి చేరితో సదరు హీరోలు భూమ్మీద నిలబడరు. కాదు కాదు అభిమానులు ఆ అవకాశం ఇవ్వరు. అంచనాలు పెంచేసుకుంటారు. ఇలా ఒకటి రెండు కాదు చాలానే సమస్యలు.. మన పాన్ ఇండియా హీరోలకు ఎదురవుతున్నాయి.
(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)
వెతుకులాట ఎక్కువవుతోంది!
పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా సులభమేమోనని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా అంటే చాలా కష్టమైన విషయం. పాన్ ఇండియా సబ్జెక్ట్ ని డీల్ చేయగలిగే దర్శకుడు దొరకాలి. అందుకు తగ్గ స్టోరీ సెట్ కావాలి. ఆ కథ.. దేశవ్యాప్తంగా అందరు ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలి. మళ్లీ అలాంటి సినిమాకు చిన్న బడ్జెట్ లు సరిపోవు. కొన్నిసార్లు స్టోరీ సింపుల్ గా ఉన్నాసరే భారీతనం ఎక్కువుండాలనే ఆరాటంతో చాలా సినిమాలు బోల్తా కొట్టేస్తున్నాయి.
కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్
హీరోగా ఓ ఇండస్ట్రీకే పరిమితమైతే ఎలాంటి సినిమాలు చేసినా ఇబ్బంది ఉండదు. ఫ్లాప్ అయినా పెద్దగా ఆలోచించకుండా మరో సినిమా చేసుకోవచ్చు. ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయిపోతే మాత్రం కథల కోసం ఏళ్లకు ఏళ్లకు వెతుక్కోవాల్సి వచ్చింది. ఒకవేళ తొందరపడి సినిమాలు చేస్తే అవి ఫెయిలవుతుంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయి గానీ హిట్ అనే మాట వినిపించట్లేదు. 'కేజీఎఫ్' యష్ ది మరో కథ. 'కేజీఎఫ్ 2' వచ్చి ఏడాదవుతున్నాసరే మరో సినిమా ఓకే చేయలేనంత కన్ఫ్యూజన్ లో పడిపోయాడు.
సక్సెస్-రెమ్యునరేషన్ తిప్పలు!
పాన్ ఇండియా హీరోగా క్రేజ్ రాగానే సదరు హీరోగారి రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోతుంది. దీంతో చిన్న నిర్మాతలు అతడికి దగ్గరికి వెళ్లరు. ఉదాహరణగా చెప్పుకుంటే ప్రభాస్.. బాహుబలికి ముందు రూ.10 కోట్లలోపే రెమ్యునరేషన్ తీసుకునేవాడు! ఇప్పుడు రూ.100 కోట్లకు పైనే తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా ట్యాగ్ రాగానే సరిపోదు. సక్సెస్ ని కొనసాగిస్తేనే మార్కెట్ లో నిలబడతారు. లేదంటే ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా దుకాణం సర్దేస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే పాన్ ఇండియా హీరోలకు బోలెడన్నీ కష్టాలే కష్టాలు!
(ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?)
Comments
Please login to add a commentAdd a comment