తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా గుర్తింపు పొందారు. ఇదే క్రమంలో అన్నయ్య చిరంజీవి బాటలోనే పవన్ కళ్యాణ్ తక్కువ కాలంలోనే పవర్ స్టార్‌గా ఎదిగారు. అయితే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు పొందడం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ వివరాల్లోకి వెళితే.. సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. అప్పట్లో పవన్ కల్యాణ్ తన చిన్న అన్నయ్య నాగబాబుతో కలిసి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఆ సినిమా ఏవరేజ్‌గా నిలిచింది. ఆ సినిమా తదుపరి పవన్ కళ్యాణ్, చిరంజీవికి హిట్లర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేశారు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
‘గోకులంలో సీత’ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా పోసాని తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని సంబోధించారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు కూడా రాశాయి. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేశారు.
అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా బిరుదు పొందడం వెనుక పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు పోసాని కూడా ప్రస్తావించారు. ఇక సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ 50వ జన్మదినం కావడంతో తన సినిమాలకి సంబందించిన తాజా అప్‌డేట్లతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరి హర వీరమల్లు’తో పాటు హరీష్ శంకర్ సినిమాలతో తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment