
కదలిరండి, మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకోండి.. అని ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్ నెత్తీనోరూ మొత్తుకుంది. అయినా సరే హైదరాబాదీలు బద్ధకం వదల్లేదు. పోలింగే ప్రారంభం అయ్యే సమయం నుంచీ ముగిసే సమయం వరకు ఎక్కడా పెద్దగా హడావుడి కనిపించలేదు. కొన్నిచోట్ల పోలింగ్ సిబ్బంది ఈగలు తోలుకావాల్సిన దారుణ పరిస్థితి దాపురించింది. మొత్తానికి జనాల బద్ధకంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ 45.71 శాతానికి పరిమితమైంది. హైదరాబాదీల తీరుపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ నగరానికి ఏమైంది? బిగ్‌బాస్ షోలో ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపే జనం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం మొహం చాటేశారేంటి? అని విమర్శిస్తున్నారు.
(చదవండి: బిగ్‌బాస్: వచ్చే వారం నుంచి రాత్రి పదింటికి!)
నిన్న ఈ సమయానికి ఓటేయండని కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రచారం చేయగా నెటిజన్లు వారికి కూడా ఊహించని షాకులు ఇచ్చారు. 'మేము అభిజిత్‌కు వేశాం, లేదు, లేదు.. అఖిల్‌కు వేశాం', 'మా వాడంటే మా వాడే గెలుస్తాడు, మీరు కూడా ఈ కంటెస్టెంట్‌కే సపోర్ట్ చేయండి, ఇతడికే ఓట్లు వేయండి..' అంటూ వాళ్లకే తిరిగి సలహాలు ఇచ్చారు. ఈ షాకులతో అవాక్కయిన సెలబ్రిటీలు నవ్వాలో, ఏడవాలో తెలీని అయోమయంలో పడ్డారు. మేం చెప్తోంది హైదరాబాద్ ఎలక్షన్స్ గురించిరా బాబూ అని నెటిజన్లకు పెద్ద దండం పెట్టేశారు. నెట్టింట కూడా జీహెచ్ఎంసీ పోల్స్ మీద ఫన్నీ మీమ్స్ బాగా వైరల్ అయ్యాయి. బాధ్యత గల వ్యక్తిగా ఓటు వేయడం చాలా ముఖ్యం అని ఒకరు చెప్తుంటే.. అవును, అభి ఎలాగో సేఫ్, హారిక డేంజర్ జోన్‌లో ఉంది కాబట్టి ఆమెకు వేశాను... అంటూ కేవలం బిగ్‌బాస్ ఓట్ల గురించే మాట్లాడుతున్నట్లుగా మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. (చదవండి: హైదరాబాదీల బద్ధకంపై జోకులు..!)
Comments
Please login to add a commentAdd a comment